జోరు పెంచిన ఈడీ.. నిన్న మంత్రి.. నేడు TRSఎంపీ కార్యాలయంలో దాడులు
ఢిల్లీలిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం నుంచి హైదరబాద్, కరీంనగర్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈడీ, ఐటీ అధికారులు వరుస షాక్ లు ఇస్తున్నారు. నిన్న మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన గ్రానైట్ కంపెనీల విషయమైన ఈడీ, ఐటీ దాడులు నిర్వహించగా తాజాగా గురువారం టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా రెయిడ్‌లు చేశారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గల ఆఫీస్‌లో 11 గంటలకుగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణల మేరకు ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారంలో భాగంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో అధికారులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ బడా నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు జోరందకుంది. ఇదే సమయంలో గ్రానైట్ సంస్థల అక్రమాల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలపై తమ పార్టీ నాయకులనే ఈడీ, ఐటీ అధికారులు టార్గెట్ చేస్తుండటం టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.