ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సీరియస్.. నిందితుల నోటితోనే నిజాలు కక్కించేందుకు స్పెషల్ ప్లాన్!

ఢిల్లీ లిక్కర్ లిక్కర్ పాలసీ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలువురు అనుమానితులు, నిందితులను తొలుత విడివిడిగానే ప్రశ్నించారు.

Update: 2023-03-20 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ లిక్కర్ పాలసీ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలువురు అనుమానితులు, నిందితులను తొలుత విడివిడిగానే ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఇందులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్‌ను సైతం విడిగానే ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తొలిసారి ప్రశ్నించడానికి ముందు రోజున పిళ్లయ్ తన పాత స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఊహించని విధంగా పిళ్లయ్ తీసుకున్న యూ టర్న్ ఈడీ అధికారులను ఆగ్రహానికి గురిచేసింది.

ఒక కీలక వ్యక్తిని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్న సమయంలో పిళ్లయ్ మాట మార్చడాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఈడీ అధికారులు బెదిరించి, ఒత్తిడి తీసుకొచ్చి తన నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారని, అందువల్లనే వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. దీన్ని విచారించిన స్పెషల్ జడ్జి ఈడీకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. ఈడీ ఇచ్చిన రిప్లయ్‌లో.. పిళ్లయ్ గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లన్నీ వీడియోలో రికార్డు అయ్యాయని, వాటిని పరిశీలించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎవ్వరినీ మానసికంగా, శారీరకంగా బలవంతపెట్టలేదని, వేధించలేదని, బెదిరించలేదని పేర్కొన్నది. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు.. ట్రయల్ సందర్భంగా తేలుస్తామని ప్రకటించింది.

అప్పటి నుంచి జాయింట్ ఎంక్వయిరీలు

పిళ్లయ్ నుంచి అనూహ్యంగా వెలువడిన మార్పుతో ఈడీ అధికారులు సరికొత్త వ్యూహాన్ని రూపొందించారు. విడివిడిగా జరిపే విచారణల అనంతరం జాయింట్‌గా ఎంక్వయిరీ చేయడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో తొలుత కవితకు నోటీసులు జారీచేసినప్పుడు ఈ నెల 11న జాయింట్ ఎంక్వయిరీ ఉంటుందనే సమాచారాన్నే ఇచ్చారు. కవిత సైతం దీన్ని ధ్రువీకరించారు. మనీశ్ సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ అధికారులు రాహుల్‌సింగ్, సి.అరవింద్, దినేశ్ అరోరా, అమిత్ అరోరా తదితరులందరినీ జాయింట్‌గానే విచారించేలా షెడ్యూలు రూపొందించుకున్నది.

క్రాస్ ఎగ్జామినేషన్‌

ఒంటరిగా విచారించే సమయంలో ఈడీ అధికారులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని, ఒత్తిడికి గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో జాయింట్ ఎంక్వయిరీలపై దృష్టి పెట్టింది. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, చందన్‌రెడ్డి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టడంతో వినికిడి శక్తి కోల్పోయారంటూ సుప్రీంకోర్టులో కవిత ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. కొన్ని డాక్యుమెంట్లనూ ఆమె సమర్పించారు. ఇలాంటి ఆరోపణలకు తావులేకుండా జాయింట్ ఎంక్వయిరీ ద్వారా ఎవరెవరి మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయో, లిక్కర్ స్కామ్‌లో వారి ప్రమేయం ఏ మేరకు ఉన్నదో తగిన ఆధారాలను దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా కప్పిపుచ్చకుండా ఉండేలా ఈడీ వ్యవహరిస్తున్నది.

గత స్టేట్‌మెంట్ల ఆధారంగా..

నిందితులు, అనుమానితులు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లలో వెల్లడించిన వివరాలకు అనుగుణంగా తగిన ఆధారాలను కూడా ఈడీ సేకరించింది. జాయింట్ ఎంక్వయిరీల సందర్భంగా వాటిని వారి ముందు పెట్టి వాస్తవాలను రాబట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. విడివిడిగా జరిగిన విచారణ సందర్భంగా ఒకరు వెల్లడించిన వివరాలను మరొకరి దగ్గర ప్రస్తావించినప్పుడు వాటికి భిన్నంగా సమాధానాలు రావడంతో ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేలా ప్లాన్ చేసింది. వారి నుంచే వాస్తవాలను కక్కించాలనుకుంటున్నది. నిజాలను దాచిపెట్టే ఆస్కారం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పిళ్లయ్ అనూహ్య మార్పుతో ఈడీ అధికారులకు కొత్త విధానం అనివార్యమైంది.

ఎక్సైజ్ శాఖకు తెలియకుండానే..

ఒకరు నిజాన్ని దాచిపెట్టినా ఎదురుగా ఉండే మరో వ్యక్తి నుంచి వాస్తవాలను రాబట్టేలా చూస్తున్నది. లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ఎక్సయిజ్ శాఖకు కూడా తెలియకుండా ఆ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కలిసి కొద్దిమంది లిక్కర్ వ్యాపారులు, రాజకీయ నేతలతో కుమ్మక్కై మార్పులు చేసినట్లు ఆ శాఖ మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు చేయించింది సౌత్ గ్రూపు సభ్యులేనని ఆరోపించారు. వెంటనే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా హోటళ్ళ నుంచి సీసీటీపీ ఫుటేజీని సేకరించడంతో పాటు ముసాయిదా డాక్యుమెంట్‌కు ఎక్కడెక్కడ మార్పులు జరిగాయో ప్రింటర్ హిస్టరీ, కంప్యూటర్ హార్డ్ డిస్కుల ద్వారా ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. ఈ ఆరోపణలకు తగినట్లుగానే సిసోడియా, సి.అరవింద్‌లతో జాయింట్ ఎంక్వయిరీకి డేట్ ఫిక్స్ చేశారు.

Tags:    

Similar News