Earthquake: తెలంగాణలో భూకంపం.. పలు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి
తెలంగాణలో భూకంపం సంభవించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.25 గంటల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ హఠాత్పరిణామంలో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే లోపే అంతా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రగా 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తరువాత తెలంగాణలో హఠాత్తుగా భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మొదట ములుగు జిల్లాలో మేడారం, మారేడుపాక, బోర్లగూడెం మధ్య ఉన్న ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి లోపల 40 కి.మీ లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతంలో ప్రకంపనలు అధికంగా కనిపించాయి. ఇళ్లు కదిలిపోతున్నట్లు అనిపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఇళ్లలోని వస్తువులు పడిపోవడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు.
ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హనుమకొండ, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో సుమారు 7 సెకన్ల పాటు భూమి కంపించిట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ మహా నగరంలో 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి రివర్ బెడ్‌లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా సమాచారం.