ఎర్లీబర్డ్ కలెక్షన్‌కు ఎన్ని అడ్డంకులు? వరుస సెలవులతో స్తంభించిన కలెక్షన్
జీహెచ్ఎంసీలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం ముదురుతుంది. ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కనీసం టార్గెట్‌కు తగ్గట్టు వసూలవుతుందని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి.
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం ముదురుతుంది. ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కనీసం టార్గెట్‌కు తగ్గట్టు వసూలవుతుందని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. రూ.2 వేల కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకోగా, కేవలం రూ.1641 కోట్లు మాత్రమే వసూలైంది. గత ఆర్థిక సంవత్సరం కలెక్షన్ తగ్గిన 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అమలు చేసే ఎర్లీబర్డ్‌తోనైనా నష్టాన్ని పూడ్చుకుందామని భావించిన అధికారులకు అనూహ్యమైన అడ్డుంకులొచ్చి పడుతున్నాయి. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా కలెక్షన్స్ మరింత తగ్గేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్‌ను క్షేత్రస్థాయిలో వసూలు చేసేందుకు సుమారు 140 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, మరో 300 మంది బిల్ కలెక్టర్లున్నా, ఈసారి క్షేత్ర స్థాయిలో వసూళ్లు బాగా తగ్గాయి. ఇలాంటి గడ్డుపరిస్థితులను కాస్త ముందుగానే పసిగట్టిన అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేస్తేనే జీతాలు చెల్లించేందుకు వీలుంటుందని తేల్చి చెప్పినా, సిబ్బంది ఖాతరు చేయలేదు. పైగా ట్యాక్స్ వసూళ్లకు కొందరు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ప్రైవేటు ఏజెంట్లను వినియోగిస్తున్నట్లు కూడా కమిషనర్‌కు ఫిర్యాదులు రావటంతో ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ కలెక్షన్‌కు ప్రైవేటు ఏజెంట్లను వినియోగించరాదంటూ, ఒక వేళ తమ ఆదేశాలను ఉల్లంఘించి వినియోగించినట్లయితే కఠిన చర్యలుంటాయని కమిషనర్ లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. సిబ్బంది యథేచ్చగా ప్రైవేటు ఏజెంట్లను వినియోగిస్తున్నా, దీనిపై ఫిర్యాదు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం వారి విధి నిర్వహణకు నిదర్శనం.
రెండు నెలలు ఎర్లీబర్డ్ అమలు?
కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్‌ను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు వీలుగా కొంతకాలంగా ప్రతి ఏప్రిల్‌లో ఐదు శాతం రిబేటునిస్తూ ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో కరోనా కారణంగా ఈ స్కీంను రెండు నెలల పాటు అమలు చేసిన సర్కారు ఈసారి కూడా కలెక్షన్ కోసం ఏప్రిల్ నెలతో పాటు మే నెల కూడా అమలు చేస్తారా? అన్న చర్చ నెలకొంది. ఎర్లీబర్డ్ కలెక్షన్ రూ.వెయ్యి కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్న జీహెచ్ఎంసీకి ఇప్పటికే ఎర్లీబర్డ్ స్కీం అమలు పది రోజులు గడవటం, ఆశించిన స్థాయిలో ట్యాక్స్ వసూలు కాకపోవటంతో వచ్చే నెల కూడా ఈ స్కీంను సర్కారు కొనసాగించే అవకాశాలున్నట్లు, కొనసాగించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ త్వరలోనే జీహెచ్ఎంసీ లేఖ రాసే అవకాశాలున్నట్లు సమాచారం.