సీఎస్ సోమేశ్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలి.. MLA రఘునందన్ రావు
తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
దిశ, చేగుంట: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్ర క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ ను తెలంగాణ ఐఏఎస్ అధికారిగా నియమించడం పట్ల ఆక్షిపించిందని పేర్కొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ పై పలు దఫాలుగా ఫిర్యాదులు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆలస్యంగానైనా తీర్పు ఇవ్వడం హర్షనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పును అనుసరించి వెంటనే రిలీవ్ చేయాలని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సొమ్ములు దోచుకోవడం పట్ల సీఎస్ సోమేశ్ కుమార్ కు ఉన్న ప్రేమ మూడు వారాలపాటు ఎక్స్టెన్షన్ అడగడం పైనే తెలిసిపోతుందని ఆరోపించారు.
ఎంతో మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ ను సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు కొంతమంది బ్యూరోక్రాట్లు కలిసి అమలు చేశారని మండపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్ర క్యాడర్ కు బదిలీ అయిన అధికారులను వెంటనే బదిలీ చేసి కొత్త సీఎస్ ను నియమించాలని సూచించారు. అదే విధంగా కొత్త తాత్కాలిక డీజీపీగా నియమించబడ్డ అంజనీ కుమార్ విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోజించాలని సూచించారు. బీహార్ అధికారుల పెత్తనం తెలంగాణ పై ఎందుకని ప్రశ్నించారు. ఒక బీహార్ అధికారి తో వేగలేకపోతున్నామంటే మరో బీహార్ అధికారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ఏంటని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉన్నత స్థానాల్లో నియమించాల్సిన అవసరం ఉందని రఘునందన్ అన్నారు.