4 నెలలు.. 1000 మంది ప్రాణాలు.. ఉచిత సేవలు చేస్తోన్న యువ డాక్టర్లు

అత్యవసర సమయంలో ఒక ఫోన్ కాల్‌ చేస్తే చాలు.. డాక్టరే మీ పక్కన ఉన్నంత భరోసా కలుగుతుంది.

Update: 2024-03-14 14:34 GMT

దిశ, రాచకొండ : అత్యవసర సమయంలో ఒక ఫోన్ కాల్‌ చేస్తే చాలు.. డాక్టరే మీ పక్కన ఉన్నంత భరోసా కలుగుతుంది. సమస్య ఏంటో చెబితే చాలు.. ప్రాణ వాయువులాంటి వైద్య సలహాలు ఇచ్చి వందల మంది జీవితాలను నిలబెడుతున్నారు ఈ యువ డాక్టర్లు. ఓ వైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు స్వచ్ఛంద సేవలు చేస్తూ వెయ్యి మంది రోగుల ప్రాణాలను కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించారు. ఇలా రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌లోపాటు మరో నాలుగు జిల్లాల్లో వైద్య సేవలు అందిస్తున్నదే డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్ (Dr. Net Medical Services). పూర్తిగా ఉచితంగా ఈ సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్‌కు ఎలా బీజం పడింది..?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాచమళ్ల ధన (25) విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. గత ఏడాది మార్చి నెలలో ధన స్నేహితుడి తండ్రి గుండె నొప్పితో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొంది మృతి చెందారు. ఆ సంఘటనతో తీవ్రంగా బాధపడ్డ డాక్టర్ ధన.. సరైన సలహాలు ఇచ్చేవారుంటే తన స్నేహితుడి తండ్రి మరి కొంతకాలం బతికేవాడని మదన పడుతూ ఆలోచించాడు.  అలా ఆయన ఆలోచన నుంచి పుట్టిందే డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్.

ఈ సర్వీస్ కోసం డాక్టర్ ధన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, సంగారెడ్డి, కరీంనగర్, విజయవాడ, నల్గొండ జిల్లాలో ఉన్న ఉత్తమ వైద్యులు, ఆసుపత్రుల వివరాలు, కార్డియాక్, డయాబెటిస్, ఫిజియోథెరపీ, న్యూరోసర్జన్, అంబులెన్సు సేవల సమాచారాన్ని సేకరించి ఓ డాటాలోకి చేర్చారు. ఈ విషయాన్ని మరో నలుగురు డాక్టర్ స్నేహితులతో పంచుకున్నాడు. వారు ఈ సేవా ఉద్దేశ్యానికి సై అనడంతో డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ -9000299892, వెబ్ సైట్‌ను ప్రారంభించారు. 45 మంది వృత్తిపరంగా నిష్ణాతులైనా వైద్యులు, 60 కి పైగా ఆసుపత్రుల ఇప్పుడు డాక్టర్. నెట్ మెడికల్స్‌కు తోడయ్యాయి.

వెయ్యి మందికి సరైనా టైంలో బెస్ట్ ట్రీట్మెంట్

2023 డిసెంబర్ నెలలో ప్రారంభమైన డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్ 4 నెలల్లో 1000 మందికి సరైన టైంలో బెస్ట్ ట్రీట్మెంట్ అందేలా చేసింది. ఈ డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్‌కు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో రోగులకు అత్యవసర వైద్య సేవలతో మెరుగైన మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యుల వివరాలు అందుతున్నాయి.

* ఏడాదిన్నర పాపకు బ్రెయిన్‌లో సమస్య ఉండటంతో పాప తల్లిదండ్రులు 8 నెలలుగా 15 ఆసుపత్రులు తిరిగారు. చివరకు డాక్టర్.నెట్ మెడికల్ సర్వీసెస్‌ను సంప్రదించారు. వారిచ్చిన సలహాలతో పాప అనారోగ్య సమస్యకు పరిష్కారం లభించింది.

* 19 సంవత్సరాల యువతికి గుండెలో రంధ్రం ఏర్పడింది. ఈ యువ వైద్యులు ఇచ్చిన సలహాతో గుండె రంధ్రంకు చికిత్స అందింది. ఇలా యువ డాక్టర్ల సలహాలతో మెరుగైన వైద్యంతో పాటు వారి మానిటరింగ్ విధానం చాలా మంది రోగుల కుటుంబాలకు వైద్యపరంగా భరోసా, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.

చాలా సంతోషంగా ఉంది : డాక్టర్ రాచమళ్ల ధన, డాక్టర్.నెట్ వ్యవస్థాకులు

చాలా మందికి తమ రోగానికి సంబంధించిన వైద్యం ఎలా పొందాలో తెలియదు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇలా చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది గమనించి మేము చేసిన ప్రయత్నంలో 4 నెలల్లోనే వెయ్యి మంది మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యావంతులుగా మారడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సేవలను స్వచ్ఛదంగా ఉచితంగా ఇస్తున్నాం. మేము 24/7 పని చేస్తున్నం.

Tags:    

Similar News