మల్కాజిగిరి MP బరిలో డీపీఎస్ అధినేత!

దేశంలోనే అతి ఎక్కువ ఓటర్లు కలిగి ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం హాట్ సీట్‌గా మారింది.

Update: 2024-01-03 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే అతి ఎక్కువ ఓటర్లు కలిగి ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం హాట్ సీట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూపు విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమరయ్య ఆసక్తి చూపిస్తున్నారు. పల్లవి గ్రూపు తరఫున ప్రాథమిక పాఠశాలలు మొదలు ఇంజినీరింగ్ కాలేజీల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొల్పారు. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు కేరాఫ్‌గా మల్క కొమరయ్య గుర్తింపు పొందారు. రాజకీయాలతో ప్రత్యక్ష పరిచయం, సంబంధం లేని కొమరయ్య ఫస్ట్ టైమ్ బీజేపీ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.

అర్బన్ ఓటర్లలో మోడీ పట్ల ఉన్న ఆకర్షణ, ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న ఆదరణ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టైమ్ డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి కొమరయ్య ఎంటర్ అవుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలంగాణలో విద్యారంగంతో పాటు పర్యావరణం, రియల్ ఎస్టేట్, వైద్య రంగాల్లో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శ్రేయోభిలాషులుగా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ, పేదలకు సేవ చేయాలన్న దృక్పథం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బీజేపీ సైతం కొమరయ్య అభ్యర్థిత్వం విషయంలో ఢిల్లీ స్థాయిలో ఆలోచిస్తున్నది. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపుల తర్వాత త్వరలో స్పష్టమైన ప్రకటన చేయనున్నది.

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ స్థానాల్లో ఉన్న బీజేపీ ఈసారి కనీసంగా 10 చోట్ల గెలవాలని టార్గెట్‌గా పెట్టుకోవడంతో అటు పాపులారిటీ ఉన్న వ్యక్తులతో పాటు విజయావకాశాలు ఉన్న పార్టీ లీడర్లనూ అన్వేషిస్తున్నది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రొ-వైస్ చైర్మన్‌గా మాత్రమే కాక పల్లవి గ్రూపు విద్యా సంస్థల అధినేతగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన కొమరయ్యను మల్కాజిగిరి అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉన్నదని సమాచారం. పెద్దపల్లి ప్రాంతంలోని సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన కొమరయ్య ప్రాథమిక విద్య మొదలు ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసేంత వరకు అనేక ఇబ్బందులను అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదగడం గమనార్హం.

సమాజం పట్ల స్పష్టమైన విజన్, ఏదో చేయాలన్న తపన, దానికి కార్యరూపం ఇచ్చే నాలుగు దశాబ్దాల అనుభవం, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న దూరదృష్టి, పేదరికం చదువుకు దూరం కారాదన్న కోణంలో స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, గ్రామీణ పేదల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపుల నిర్వహణ, సొంతంగా స్థాపించిన ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. ఇలాంటి అనేక అంశాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుంటున్నది. మాటల్లోనేకాక చేతల్లోనూ కొమరయ్య సామాజిక సేవా దృక్పథం బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఆకర్షించింది. 40 ఏండ్ల ఆయన ఆచరణ, సమాజంలో లభించిన గుర్తింపు, నిరాడంబరత, సేవ చేయాలనే ఆలోచన బీజేపీ తరఫున ఆయనకు ప్లస్ పాయింట్లు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా : కొమరయ్య

“గ్రామీణ, వ్యవసాయ నేపథ్యం నుంచి విద్యా సంస్థల అధినేతగా, పారిశ్రామికవేత్తగా, ఫిలాంథ్రపిస్టుగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా తెలంగాణలో గుర్తింపు పొందిన నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. నా మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా సంవత్సరాలుగా కోరుతున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా. బీసీ కమ్యూనిటీకి చెందిన నరేంద్రమోడీ పదేండ్లుగా దేశానికి ప్రధానిగా ఉన్నారు. యువత కోసం ప్రవేశ పెట్టిన స్కీములతో నాకు సంతృప్తి ఉన్నది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని తెలంగాణ గడ్డ మీదనే మోడీ స్పష్టం చేశారు. నేను బీసీ బిడ్డనే. సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, బీసీల అభ్యున్నతి కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో పని చేసేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా.”

రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో ఎంట్రీ

పెద్దపల్లిలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన కొమరయ్య (1959) సొంత ఊరిలోనే మూడో తరగతి వరకు చదువుకున్నారు. టెన్త్ క్లాస్ వరకు అప్పన్నపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసించారు. కరీంనగర్ జూనియర్ కళాశాలలో 1976లో ఇంటర్‌లో చేరి 1978లో ఎంసెట్‌లో ఉత్తీర్ణులై ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు. 1984లో శాలివాహన పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. ఆ రంగంతో పరిచయం, అనుభవం లేకపోయినప్పటికీ సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు చూసుకుంటూ అంచెలంచెలుగా వ్యాపారాన్ని విస్తరింపజేశారు.

దిగువ, మధ్యతరగతి సెక్షన్ల ప్రజలకు హౌజింగ్ వసతికి ఆటంకంగా ఉండే ఆర్థిక పరిస్థితులను గమనంలోకి తీసుకుని లైవ్ వెల్ హోమ్ ఫైనాన్స్ అనే సంస్థను 1993లోనే శాలివాహన ఫౌండేషన్‌కు అనుబంధంగా నెలకొల్పారు. పర్యావరణంపై ఆసక్తితో శాలివాహన గ్రీన్ ఎనర్జీ, శాలివాహన బయోమాస్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు, అల్పాదాయ సెక్షన్లకు చెందిన యువత, మహిళలకు ఆటోమొబైల్ రంగంలో శిక్షణ, ఉపాధి అవసరాల కోసం నంబిరాజన్ ఫౌండేషన్.. ఇలాంటివన్నీ కొమరయ్య నాలుగు దశాబ్దాల్లో సాధించిన మైలురాళ్లు.

పల్లవి గ్రూపు అధినేతగా..

తాను విద్యార్థిగా స్వయంగా అనుభవించిన కష్టాలు ఎవరికీ రావొద్దని, ఈ రీజన్స్‌తో విద్యకు దూరం కావద్దని భావించి పల్లవి పేరుతో స్కూళ్లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు నెలకొల్పారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పల్లవి గ్రూపు విద్యా సంస్థల్లో ప్రతి ఏటా సుమారు 39 వేల మంది చదువుతుండగా, ఏటా సగటున రెండున్నర వేల మంది కోర్సులు పూర్తి చేసుకుని బైటకు వస్తున్నారు. ఈ 30 ఏండ్ల కాలంలో సుమారు లక్ష మంది పల్లవి గ్రూపులో చదివి డాక్టర్లు, ఇంజినీర్లు, జాతీయ స్థాయి క్రీడాకారులుగా వివిధ స్థాయిల్లో నిలదొక్కుకున్నారని కొమరయ్య గర్వంగా చెప్పుకుంటుంటారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 స్కూళ్లు, కాలేజీలతో పాటు మరో ఏడు ఫ్రాంచైజీలు కూడా పల్లవి పేరుతో నడుస్తున్నాయి. పేదలకు చదువుకునే అవకాశాల కోసం మూడు కేటగిరీల్లో సొంతంగా ఫౌండేషన్ తరఫున స్కాలర్‌షిప్‌లు (25% మందికి) అందజేస్తున్నారు. కొవిడ్ టైంలో అనాథలుగా మారిన పిల్లలకు పల్లవి స్కూళ్లల్లో ఉచిత విద్య అందిస్తున్నారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ

దాదాపు పదేండ్ల పాటు పల్లవి గ్రూపు సంస్థలను నిర్వహించిన అనుభవాన్ని గుర్తించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ కొమరయ్యను ఆహ్వానించి హైదరాబాద్‌లోనూ నెలకొల్పాల్సిందిగా 2003లో రిక్వెస్టు చేసింది. తొలుత సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో ఉనికిలోకి వచ్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొమరయ్య కృషితో నాచారం, నాదర్‌గుల్, ఏరోసిటీ, సంతోష్‌నగర్‌లలోనూ పని చేస్తున్నాయి. సుమారు 13 వేల మంది ఈ ఐదు క్యాంపస్‌లలో చదువుకుంటున్నారు.

వైద్యరంగంలో సేవా దృక్పథం

పేదల విద్యావసరాలకు స్కూళ్లు స్థాపించిన కొమరయ్య వైద్యంలోనూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన సర్వీస్ అందించేందుకు ప్రసాద్ హాస్పిటల్స్ పేరుతో మూడింటిని నెలకొల్పారు. తక్కువ ఖర్చుతో ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఈ ఆస్పత్రులు సుమారు 20 వేల మంది ప్రాణాలను సేవ్ చేసినట్లు, 500 మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు సగటున వెయ్యి మందికి ట్రీట్‌మెంట్ అందుతున్నదని, ఏటా 20 వేల మంది డిశ్చార్జి అవుతున్నారని తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో 150 బెడ్‌లతో సర్వీస్ చేస్తున్నాయని, గ్రామాల్లో పేదల కోసం కంటి, జనరల్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియో వాస్కులర్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పర్యావరణ ప్రేమికుడిగా..

విద్య, వైద్య రంగాలతో పాటు పర్యావరణానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ‘ఈకో భారత్’ పేరుతో కంపెనీని స్థాపించి ‘కే ఇన్నోవేటివ్’ ద్వారా పలు యాక్టివిటీస్‌ను కొమరయ్య చేపట్టారు. డీఆర్డీవో సహకారంతో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ టెక్నాలజీకి ఈకో భారత్ సంస్థ ద్వారా శ్రీకారం చుట్టారు. చెరకు, మొక్కజొన్న పంటల వ్యర్థాల నుంచి బయో డీగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీపై ఫోకస్ పెట్టారు. శాలివాహన గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 88 మెగావాట్ల విద్యుత్‌ను వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేయిస్తున్నారు. మంచిర్యాలలో 6 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టి మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఐదు బయోమాస్ పవర్ ప్లాంట్లు పని చేస్తున్నాయి.


Similar News