BRS: బీఆర్ఎస్ కు డబుల్ షాక్.. ఎదురుతిరిగిన కేటీఆర్ ప్లాన్

కేటీఆర్ ప్లాన్ ఎదురుతిరిగింది.

Update: 2024-11-21 08:52 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: లగచర్ల (Lagacharla) ఘటనలో రైతుల అరెస్టును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా మానుకోట (Manukota)లో మహాధర్నాకు ప్లాన్ చేసిన బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. ఇవాళ్టి ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. కేటీఆర్‌‌ (KTR) పర్యటనను అడ్డుకుంటామని కొన్ని స్థానిక గిరిజన సంఘాలు ప్రకటించడంతో లా అండ్‌‌ ఆర్డర్‌‌ సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ మహాధర్నాను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామనుకున్న బీఆర్ఎస్ కు మహబూబాబాద్ స్థానికుల నుంచి వ్యతిరేకత, పోలీసుల అనుమతి నిరాకరణతో డబుల్ షాక్ గా మారింది.

అప్పుడు జైల్లో వేసి ఇప్పుడెందుకు వస్తున్నారు?

మహాధర్నా (Maha Dharna) కు వస్తున్న కేటీఆర్ ను అడ్డుకుంటామని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా భూములను లాక్కొని ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని అర్దరాత్రి సెంట్రల్ జైల్లో వేశారని స్థానిక గిరిజన మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశాడని, న్యాయం కోసం హరీశ్ రావు (Harish Rao) వద్దకు వెళ్తే మీరెవరో నాకు తెలియదని వెళ్లిపొమన్నాడని, భూములకు కనీసం నష్టపరిహారం అయినా ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదన్నారు. అధికారంలో ఉండగా అన్యాం చేసి ఇప్పుడు మహబూబాబాద్ కు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోవట్లేదు: కేటీఆర్

మహబూబాబాద్ మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోవట్లేదంటూ విమర్శించారు. 'నిమిషానికి నలభైసార్ల కేసీఆర్ రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో కేసీఆర్ ముందు నుంచునే మాట దేవుడెరుగు… కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!' అంటూ ట్వీట్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్:

బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనమతి నిరాకరించడంతో బుధ‌వారం రాత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు క‌విత‌, బీఆర్ఎస్ నాయ‌కుడు, రాజ్యసభ సభ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి, ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంక‌ర్‌నాయ‌క్‌, రెడ్యానాయ‌క్. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స‌హా జిల్లాకు చెందిన ముఖ్య నేత‌లు మ‌హ‌బూబాబాద్‌ ఎస్పీ కార్యాల‌యం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్పీ ఆఫీస్ గేటు ముందు బైఠాయించి పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడే నిరసన వ్యక్తం చేసుకోవాలని లగచర్ల ఘటనతో సంబంధం లేని మానుకోటలో ధర్నాకు అనుమతి కుదరదని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్పష్టం చేశారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు సైతం బీఆర్ఎస్ తీరును తప్పుబడుతూ ప్రెస్ మీట్లు నిర్వహించడంతో విషయం అల్లర్లకు దారితీసే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం 163 బిఎన్ఎస్ఎస్ -2023 (144 సెక్షన్) అమలుచేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజా ప‌రిణామాల‌తో జిల్లా వ్యాప్తంగా హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

Tags:    

Similar News