ధర్నాలు చేయండి.. BRS ఎంపీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

రాష్ట్ర అవసరాల విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Update: 2024-02-02 03:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవసరాల విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఫస్ట్ టైమ్ బైటకొచ్చి ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన నివాసం నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలిఫోన్‌లో మాట్లాడి బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్ళకుండా ఒత్తిడి పెంచాలన్నారు. పార్లమెంటు ఉభయ సభల లోపలా, ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలు చేయాలన్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై వ్యతిరేకతను వ్యక్తం చేయాలన్నారు.

సందర్భానికి అనుగుణంగా బడ్జెట్‌పై చర్చలు జరుగుతుండగానే తెలంగాణ అంశాన్ని లేవనెత్తి ప్లకార్డుల చేతపట్టి సమయానుకూలంగా హౌజ్‌ లోపలే నిరసనలు చేయాలన్నారు. గత సమావేశాల్లో సైతం రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తినట్లుగానే ఇప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే గొంతు విప్పాలని, కేంద్ర ప్రభుత్వంపై వీలైన్న అన్ని రూపాల్లో ఒత్తిడి పెంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు ఎంపీ ఒకరు తెలిపారు.

నిరాశా నిస్పృహల బడ్జెట్‌ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి నిరాశా నిస్పృహలతో కూడుకుని ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగమంతా బీజేపీ సొంత డబ్బాయేనని, గొప్పలు చెప్పుకునే ప్రయత్నం మినహా ఏ వర్గాన్నీ సంతృప్తిపర్చలేదన్నారు. కేవలం రాజకీయ ప్రసంగమేనన్నారు. ఆశలు రేకెత్తించడానికి బదులు నిరాశలోకి నెట్టిందన్నారు. కొత్త సంక్షేమ పథకం ఒక్కటి కూడా లేదని, ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని చక్కదిద్దే ప్రయత్నాలూ లేవన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి నిర్దిష్టమైన ప్రణాళికా లేదని, ఉద్యోగాల ప్రస్తావన అంతకంటే లేదని, చివరకు రైతులకు, వ్యవసాయానికి ఉపయోగపడే విషయాలూ లేవన్నారు. సామాన్యులకు, ఉద్యోగులకు కూడా ఎలాంటి ఊరట లేదన్నారు.

నల్లధనాన్ని వాపస్ తెచ్చి ప్రతీ ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పినా ఇప్పటికీ అది అమలు కాలేదని, బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఆయిష్మాన్ భారత్ పథకం కింద అందించే కవరేజ్‌ను రూ. 10 లక్షలకు పెంచుతారని పేదలు ఎదురు చూసినా నిరాశే మిగిలిందన్నారు. ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ మొండి చేయే ఎదురైందని, విభజన హామీల అమలుకోసంగానీ, హక్కుగా రావాల్సిన నిధుల విడుదల గురించిగానీ ప్రస్తావనే లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ వాడుకున్నదే తప్ప దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా లేదన్నారు.

Tags:    

Similar News