‘కేసీఆర్ తన గొప్పను చాటుకునేందుకే ‘దిశ’ ఎన్ కౌంటర్’

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలు అంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2023-03-06 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలు అంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నా వారిని కాపాడుకుంటూ వెనకేసుకు వస్తున్న తీరుతో బీఆర్ఎస్ మాకు అండగా ఉంటుందని ధీమా నేరస్తులలో పెరుగుతోందని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం బండి సంజయ్ చేపట్టిన ఒక్కరోజు దీక్షలో ఆమె మాట్లాడారు. ప్రీతి ఘటనలో కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటే నేరాన్ని తప్పించుకునేందుకు ఎంతలా పగడ్బందీ ప్లాన్ చేశారో అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని ఆడపిల్లలను చదువుకునేందుకు హాస్టల్ లకు పంపాలన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఉన్నాయన్నారు.

తన గొప్పతనాన్ని చాటుకునేందుకే దిశా కేసులో ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ ప్రీతి ఘటనపై పూర్తిగా మౌనం వహించారని ఆరోపించారు. ఈ ఘటనలో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కేసీఆర్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మొదటి క్యాబినెట్‌లో మహిళలకు చోటు లేదని విమర్శలు రావడంతో రెండో క్యాబినెట్ లో కేవలం ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చాడని మండిపడ్డారు. కేసీఆర్‌కు మరోసారి అధికారంలోకి రావాలనే అలోచనే తప్ప మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆలోచన చేస్తున్నాడా అని ప్రశ్నించాడు.

Tags:    

Similar News