Free Tablets : ఫైలేరియా, నులిపురుగుల నిర్మూల‌న‌కు ఉచిత మాత్రల పంపిణీ: మంత్రి

రాష్ట్రంలో ఫైలేరియా మరియు నులిపురుగుల నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు.

Update: 2024-08-10 11:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఫైలేరియా మరియు నులిపురుగుల నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ అండ్ వైద్య శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హైదరాబాదులోని తన కార్యాలయం నుంచి పాల్గొని రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజలకు బోధకాల వ్యాధి, నులిపురుగుల వ్యాధి నివారణకు డీ.ఈ.సీ అండ్ ఆల్బెండజోల్, హైపర్ మెట్టిన్ మాత్రలను నేటి నుంచి (ఆగస్టు10) నుంచి పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇందుకుగాను, తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 14 ఆరోగ్య కేంద్రాల్లో మాత్రల పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామన్నారు. అలాగే, 2522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను, బ్రోచర్లను ఆవిష్కరించారు.

జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌తో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఐపర్ మెక్టిన్, డీఈసీ మాత్రలను వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ బోదకాలు, నులి పురుగుల నివారణకు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది అందించే మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైలేరియా నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా పాల్గొన్నారు.

Tags:    

Similar News