Digitalization' of GPs: జీపీల ‘డిజిటలైజేషన్’ 50 శాతం లోపే.. కేంద్ర గణాంకాల్లో వెల్లడి

ప్రపంచంలోని పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చామని గత ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్‌లో మాత్రం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2024-08-21 01:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోని పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చామని గత ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్‌లో మాత్రం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 50 శాతం గ్రామాలు మాత్రమే ఇప్పటి వరకు డిజిటలైజ్ అయ్యాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. దీంతో వంద శాతం గ్రామాలను డిజిటలైజ్ చేసే అంశంపై ప్రస్తుత సర్కారు దృష్టి పెట్టింది.

‘గ్రామ్ స్వరాజ్’ అప్లికేషన్ తో..

గ్రామాలు, వాటి పాలకవర్గాలను పనితీరును మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న ఈ-పంచాయత్ మిషన్ మోడ్ (పీఎంఎం) ప్రొగ్రాంను ప్రారంభించింది. అంతేకాకుండా గ్రామ్ స్వరాజ్ అనే పని ఆధారిత సమగ్ర అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ లో పంచాయతీలకు సంబంధించిన అన్ని అంశాలు పొందుపర్చి ఉంటాయి. ఆన్‌లైన్ చెల్లింపులతో సహా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రణాళిక, బడ్జెట్, అకౌంటింగ్, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ మొదలైనవి ఈ అప్లికేషన్ ద్వారా వేగంగా చేసుకోవచ్చు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.44 లక్షల జీపీలకు సంబంధించి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి ఈ యాప్ లో అప్‌లోడ్ చేశారు. ఇంకా, 2024-25కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కోసం 2.06 లక్షల పంచాయతీలు ఇప్పటికే ఆన్‌లైన్ లావాదేవీలను పూర్తి చేశాయని కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రంలో 5,812 జీపీలు మాత్రమే రెడీ

రాష్ట్రంలో మొత్తం 12,771 గ్రామ పంచాయతీలు ఉంటే, అందులో 10,915 గ్రామాలు ఈ గ్రామ్ సర్వీస్ ను ఉపయోగించుకునేందుకు రెడీగా ఉన్నాయి. అయితే 5,812 గ్రామాలు మాత్రమే ఈ గ్రామ్ పంచాయతీ అప్లికేషన్ ను వినియోగించుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలు మాత్రమే తమ గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అప్‌లోడ్ చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో 50 శాతం గ్రామాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా వాటిని డిజిటలైజ్ చేయాల్సి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీ పరిస్థితి కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నట్టున్నది. బిహార్, యూపీ, రాజస్థాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈగ్రామ్ డిజిటలైజేషన్ చేయడం చాలా రాష్ట్రాలతో పోల్చితే వెనకంజలో ఉన్నాయి. మరోవైపు దక్షిణ భారతంలోనే కాదు యావత్ దేశంలో కేరళ తన గ్రామాలను దాదాపు పూర్తిగా డిజిటలైజ్ చేసి ముందంజలో ఉన్నది.

డిజిటలైజేషన్ కు రాష్ట్ర సర్కారు చర్యలు

రాష్ట్రంలో మొత్తంగా 12,771 గ్రామాలను ఈ గ్రామ్ స్వరాజ్ అప్లికేషన్ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మంత్రి సీతక్క అధికారులకు సూచన చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ కాస్త పెండింగ్ లో పడిందని, ఎన్నికల ప్రక్రియ ముగియగానే దీనిపై దృష్టి సారించి, రాష్ట్రంలో వంద శాతం గ్రామాలు డిజిటలైజ్ చేయనున్నట్టు వెల్లడిస్తున్నారు.

రాష్ట్రం                  మొత్తం జీపీలు                   ఈగ్రామ్ సర్వీస్ రెడీ జీపీలు                 డిజిటలైజ్ అయిన గ్రామాలు

తెలంగాణ                     12,771                                  10,915                                                         5,812

ఏపీ                               13,326                                  12,967                                                         5,559

కర్ణాటక                          5,952                                    6,251                                                          3,659

తమిళనాడు                  12,525                                  9,882                                                           3,449

Tags:    

Similar News

టైగర్స్ @ 42..