మహిళా కళాశాల భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. రక్షించాలని ధర్నా

నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మహిళా కళాశాల భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు రోడ్డెక్కారు.

Update: 2022-11-22 06:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ నేతల కన్ను మహిళా కళాశాల భూములపై పడింది. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మహిళా కళాశాల భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలో మహిళా కళాశాల సమీపంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద విద్యార్థినిలు రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం ఉదయం స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆధ్వర్యంలో విద్యార్థినులు ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా గడుగు రోహిత్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉమెన్స్ కళాశాల ఆస్తులపై కబ్జాదారుల కన్ను పడిందన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థినిలకు మహిళా కళాశాల సొసైటీ ఆధ్వర్యంలో తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందిస్తున్న విద్యాసంస్థ భుమూలు కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమన్నారు.

70 సంవత్సరాలుగా మహిళా కళాశాల ఆధీనంలోని భూములను కబ్జాదారులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్, ఇతర ఆదాయ మార్గాలకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మహిళా కళాశాల భూముల కబ్జా వెనుక అధికార పార్టీ లీడర్లు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారన్నారు. మహిళలకు ఉన్నత విద్యను అందించే కళాశాల భూములను కబ్జా కానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇవ్వాలని విద్యార్థినిలు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆర్మూర్ రోడ్‌లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానిక పోలీసు అధికారులు కలగజేసుకుని సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పినా వినకుండా రోడ్డుపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: రోడ్డెక్కిన బడి పిల్లలు.. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు  


Similar News