ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి: సీపీఐ నారాయణ డిమాండ్
బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌లోని ఎటూ తేలక సందిగ్ధంలో ఉన్న 20 గ్రామాలను పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్న ఆంధ్ర వారిని "గో బ్యాక్ ఆంధ్ర" అని చెప్పడం దుర్మార్గమన్నారు.
బాధ్యతాయుత పదవుల్లో ఉండి ధర్మేంద్ర ప్రధాన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి వ్యక్తులు వల్ల కేంద్రానికి నష్టం జరుగుతుందని, కాబట్టి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోడీని కోరారు. అలాగే సుదీర్ఘకాలంగా ఎటూ తేలకుండా ఉన్న ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని 20 గ్రామాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
తెలంగాణలోని వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధులకు హెల్త్ కవరేజ్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వృద్ధాప్యం అనేది ఒకరి జీవితంలో చివరి దశ అని వివరించారు. అనేక వృద్ధాశ్రమాలు వృద్ధులకు అనేక సౌకర్యాలు అందిస్తున్నాయని, కానీ ఆరోగ్య సౌకర్యాలు మాత్రం లేవని తెలిపారు. పెద్దలు స్వతంత్రంగా జీవించలేనప్పుడు పెద్దలను ఎలా చూసుకోవాలనేది అతిపెద్ద సామాజిక సమస్యలలో ఒకటని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లలో అనేక వైకల్యాలు, పెరిగిన ఆరోగ్య సంబంధిత ఖర్చుల కారణంగా, వృద్ధులను వారి బంధువులు వదిలేస్తున్నారని తెలిపారు. అంధత్వం, చెవుడు, మానసిక అనారోగ్యం మొదలైన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అందుకని తెలంగాణలోని అన్ని వృద్ధాశ్రమాలలో నివసిస్తున్న వృద్ధులకు ఆరోగ్య కవరేజీ కార్డులను పరిగణనలోకి తీసుకోవడం అత్యవసరమని సీఎంకు లేఖలో పేర్కొన్నారు.