ధర్మపురి ఎన్నికల వివాదం : స్ట్రాంగ్ రూమ్‌లో పూర్తయిన ప్రొసీజర్
ధర్మపురి ఎలక్షన్ పిటిషన్‌కు సంబంధించి ఆదివారం ఉదయం 11గంటలకు మొదలైన ప్రొసీజర్ సోమవారం తెల్లవారు 4 గంటల వరకు కొనసాగింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి ఎలక్షన్ పిటిషన్‌కు సంబంధించి ఆదివారం ఉదయం 11గంటలకు మొదలైన ప్రొసీజర్ సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది. 17 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ప్రక్రియలో రీ-కౌంటింగ్‌లో కీలకమైన 17A, 17C డాక్యూమెంట్స్‌ను అధికారులు స్కాన్ చేసి సాఫ్ట్ కాపీలు చేయడంతో పాటు జిరాక్స్ తీసినట్లు తెలుస్తుంది.
వీటితో పాటు ఎలక్షన్ జరిగిన తీరుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసిన అధికారులు డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి వీటన్నిటిని కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో కొంత సీసీ టీవీ ఫుటెజీ కనిపించడం లేదని నవ భారత్ పార్టీ అభ్యర్థి దూడ మహిపాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుండి ప్రతి దశలో ఏదో రకంగా వివాదాస్పదం అవుతున్న ఈ విషయంలో ఎట్టకేలకు అధికారులు కోర్టు అడిగిన డాకుమెంట్స్‌ని 17 గంటల పాటు శ్రమించి ప్రొసీజర్ పూర్తి చేసారు.
సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ..
ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఈసిఐ నుండి వచ్చిన ఎన్నికల అబ్సర్వర్ అవినాష్ కుమార్‌లు పిటిషనర్‌తో పాటు ఇతర అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేశారు. అనంతరం మొత్తం 258 ఈవీఎంలకు సంబంధించిన 17A, 17C పత్రాలు స్కాన్ చేయడంతో పాటు జిరాక్స్ తీసారు.
8 గంటల్లో మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అవ్వాల్సి ఉండగా స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన డాక్యుమెంట్స్ క్రమ పద్ధతిలో లేకపోవడంతో వాటన్నింటినీ సీక్వెన్స్ ఆర్డర్లో సెట్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు బ్రేక్ చేసి పని మొదలు పెట్టిన అధికారులు అదే రోజున (కంటిన్యూగా) ప్రొసీజర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గ్యాప్ ఇచ్చి రెండో రోజు కొనసాగించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సుమారు 17గంటల సుధీర్ఘ సమయం పట్టినట్లుగా స్పష్టమవుతుంది.
అడుగడుగునా నిర్లక్ష్యమే. అనేక అనుమానాలు ఉన్నాయి.
-పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రీకౌంటింగ్‌కు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. 2018లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఇతర మెటీరియల్‌ను నోటిఫైడ్ ఏరియాలో కాకుండా ధర్మపురి ప్రభుత్వ కళాశాలలో ఒకరోజు ఉంచారని అన్నారు.
ఈవీఎంలు భద్రపరిచిన వి.ఆర్.కె కాలేజీ కాంపౌండ్ నుండి స్ట్రాంగ్ రూమ్ వరకు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ కన్పించడం లేదని ఆరోపించారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్సవడం లోపల ఉన్న ట్రంకు బాక్సులకు తాళాలు లేకపోవడం, 209 బూత్‌కి సంబంధించి 17సి డాకుమెంట్స్‌కి సీల్ లేకపోవడం ఇవన్నీ కూడా అనుమానం కలిగించేలా ఉన్నాయన్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రి భద్రపరచడంలో ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. తాళాలు పోయిన ఘటనపై బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ చేస్తే నిజాలు బయటపడతాయని కోర్టుపై పూర్తి నమ్మకం ఉందని చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు.