కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు: సంకేపల్లి సుధీర్‌రెడ్డి
కేసీఆర్ రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పీసీసీ స్పోక్స్ పర్సన్ సంకేపల్లి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పీసీసీ స్పోక్స్ పర్సన్ సంకేపల్లి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి లేకుంటే, రైతు బంధు, భీమా రాదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. సీఎం హోదాలో ఇలా ప్రకటించడం సరికాదన్నారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోరాడితేనే తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో డబ్బులు వృధా చేశారన్నారు.
ఒక్క ఎకరం కూడా అదనంగా సాగులోకి రాలేదని ఆరోపించారు. కానీ ఎక్కడ నీళ్ళు కనబడినా, అవి కాళేశ్వరం నీళ్ళు అని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ చేసిన నిర్లక్ష్యంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక ధరణి పోర్టల్‌లో 60 శాతం మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ధనికులకు, పెత్తందారుకు మాత్రమే ధరణి బాగుందన్నారు. ధరణి పోర్టల్ ఏర్పాటు వెనక కేసీఆర్‌కు రహస్య ఎజెండా ఉన్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో కేసీఆర్వైఫల్యం చెందాడన్నారు.