Kishan Reddy: మజ్లిస్కు ఆ పార్టీలు బానిసలుగా మారాయి.. కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నికకు నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.

Update: 2025-04-05 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నికకు నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ ఎన్.‌గౌతమ్ రావు (Gautam Rao) నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఏఐఎంఐఎం (AIMIM) అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ (Mirza Riyaz Ul Hassan Effendi) బరిలోకి దిగారు. శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ ఎన్నిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. తాము పోటీకి చేయడం లేదని వెల్లడించింది. కానీ, తాము ఎంఐఎంకు మద్దుతు ఇస్తామని ఆ పార్టీకి సూత్రప్రాయంగా తెలిపినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా.. అందులో రెండు స్వతంత్ర అభ్యర్థులవి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) పార్టీ మధ్యే గట్టి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీలో పోటీ చేస్తాయని తాము భావించామని, కానీ పరిస్థితుల చూశాక రాష్టంలో ఎంఐఎం (MIM), కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు ఒక్కటేనని విషయం బహిర్గతమైందని కామెంట్ చేశారు. ఏకంగా నగరాన్ని వారి చేతుల్లో పెట్టేశారంటూ ఫైర్ అయ్యారు. మజ్లిస్‌ను ఏకగ్రీవంగా గెలిపించాలని ఆ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని కామెంట్ చేశారు. తాము ప్రకటించిన అభ్యర్థిపై తమ సొంత పార్టీ నేతలు వ్యతిరేకించే అంశం తమ అంతర్గత వ్యవహారమని అన్నారు. తెలంగాణ (Telangana)తో పాటు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తి అయిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా బీజేపీ జెండా ఎగురవేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

కాగా, హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) మార్చి 24 షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌. ప్రభాకర్‌ (MS Prabhakar) పదవీ కాలం ఈ ఏడాది మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో నియోజకవర్గ పరిధిలో ఎన్నకల కోడ్‌ (Election Code) అమలులోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 వరకు గడువు విధించి. వచ్చిన నామినేషన్లను ఏప్రిల్ 7 వరకు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు రెండు రోజులు అంటే ఏప్రీల్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్‌ 25న ఓట్ల లెక్కింపు చెపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

Tags:    

Similar News