Telangana DGP: డ్యూటీకి హాజరు కావాలని నొక్కిచెప్పిన డీజీపీ.. కానిస్టేబుళ్లు తగ్గేనా?

యూనిఫామ్ సర్వీసులో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనకు దిగడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీజీపీ జితేందర్(DGP Jitender)... క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించే ప్రసక్తే లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Update: 2024-10-26 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యూనిఫామ్ సర్వీసులో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనకు దిగడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీజీపీ జితేందర్(DGP Jitender)... క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించే ప్రసక్తే లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆందోళనలను కొనసాగిస్తే చట్ట (పోలీస్ ఫోర్సెస్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ రైట్స్, పోలీస్ యాక్ట్-ఇన్‌సైట్‌మెంట్ టు డిస్ ఎఫెక్షన్) ప్రకారం యాక్షన్ తీసుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. యూనిఫామ్ సర్వీసు విభాగంలో క్రమశిక్షణారాహిత్యం చాలా సీరియస్ అంశమని ఒక ప్రకటనలో నొక్కిచెప్పారు. ఈ రెండు చట్టాల ప్రకారం పోలీసులే నిరసనలు, ఆందోళనలకు దిగడం శిక్షార్హమైనవని గుర్తుచేశారు. పాత పద్ధతి కొనసాగిస్తామంటూ క్లారిటీ ఇచ్చినా ఆందోళనలకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్(Special Police Constables), వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఘటనలను ప్రస్తావిస్తూ డీజీపీ జితేందర్ పై వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణతో కూడిన ఫోర్సులో ఉంటూ ఆందోళనలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

స్పెషల్ పోలీసులకు సెలవుల విషయంలో పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసు శాఖలో పనిచేస్తూ ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పండుగలు, సెలవుల సమయంలో కూడా పోలీసులు కఠినమైన విధులను గమనంలోకి తీసుకుని విధి నిర్వహణలో ఉంటున్నారని, అందువల్లనే ఇతర ప్రభుత్వ విభాగాలకు వర్తించదని ప్రత్యేక సదుపాయాలను తెలంగాణ స్పెషల్ పోలీసులకు ప్రభుత్వం కల్పిస్తున్నదని డీజీపీ గుర్తుచేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తున్నందునే ఈ సౌకర్యాన్ని ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పోలీసు స్టాఫ్‌కు శాలరీ, అలవెన్సులు ఎక్కువగానే ఉంటున్నాయని పేర్కొన్నారు. భద్రత, ఆరోగ్య భద్రత లాంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వారికి అమలు చేస్తున్నదన్నారు. పోలీసు శాఖ ఇమేజ్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని గుర్తుచేశారు.

స్పెషల్ పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మెరిట్స్ తో పాటు సానుభూతితో అర్థం చేసుకుంటున్నదని, అందుకోసమే వారికి సరెండర్ లీవ్స్ తో, అడిషనల్ సరెండర్ లీవ్స్ లాంటి సౌకర్యాలను అందిస్తున్నదని డీజీపీ పేర్కొన్నారు. సివిల్ పోలీసులు నేరాల దర్యాప్తు, నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాల్లో ఉంటారని, జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు సాయుధ పోలీసు (ఆర్మ్ డ్ రిజర్వ్) విభాగం సహకారాన్ని తీసుకుంటూ ఉంటారని గుర్తుచేశారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల్ని మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ శాంతిభద్రతల అవసరం ఏర్పడితే అక్కడకు పంపుతుందని, ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాలకూ పంపుతుందన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే ప్రాక్టీసు కొనసాగుతూ ఉన్నదని, ఉమ్మడి రాష్ట్రంలో అమలైన విధానమే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నదన్నారు. స్పెషల్ పోలీసులకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారనే గుర్తింపు ఉన్నదని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రశంసలు వచ్చాయని డీజీపీ గుర్తుచేశారు.

స్పెషల్ పోలీసుల సమస్యలపై ప్రభుత్వానికి సానుభూతి ఉన్నదని, పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుటుందని డీజీపీ పేర్కొన్నారు. ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని ప్రాపర్ ఛానెల్‌లో ఉన్నతాధికారులకు, కమాండెంట్లకు, అదనపు డీజీపీకి లేదా స్పెషల్ పోలీసు విభాగంలోని సీనియర్లకు తెలియజేయవచ్చునని సూచించారు. ఎలాగూ వారికి ‘దర్బార్’ అనే వేదిక ఒకటి ఉన్నదని గుర్తుచేశారు. ప్రభుత్వంపై నమ్మకముంచి యధావిధిగా డ్యూటీకి హాజరు కావాలని నొక్కిచెప్పిన డీజీపీ.. ఇకపైన క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

Tags:    

Similar News