బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సింగరేణి కాలరీస్ సంస్థ విషయంలో బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు...
- చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటులో జై
- నాడు వేలం పాటలో పాల్గొనకుండా నై
- సింగరేణి బోర్డు నిర్ణయానికి భిన్నంగా నిర్ణయం
- సన్నిహితులకు కాంట్రాక్టు దక్కేలా హెల్ప్
- ‘అవంతిక’, ‘ఆరో’ కంపెనీలకు సహకారం
- సత్తుపల్లి, కోయగూడెం సింగరేణికే దక్కాలి
- కొత్త బొగ్గు గనులు మనకు దక్కాల్సిందే
- లేకుంటే భవిష్యత్తులో ‘చరిత్ర’కే పరిమితం
- త్వరలో ప్రధాని దగ్గరకు అఖిలపక్ష బృందం
దిశ, ఖమ్మం బ్యూరో: సింగరేణి కాలరీస్ సంస్థ విషయంలో బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2015లో కోల్ మైన్స్, మైన్స్ అండ్ మినరెల్స్ చట్టాలకు సవరణ చేస్తూ బొగ్గు బ్లాకుల్ని, గనులను ప్రభుత్వరంగ సంస్థలను కాదని ప్రైవేటు కంపెనీలకు మాత్రమే కట్టబెట్టేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఆ చట్టానికి అనుగుణంగా ఇప్పుడు బొగ్గు బ్లాకుల్ని వేలం వేస్తుంటే అందులో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఫలితంగా కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్న ఆరో, అవంతిక కంపెనీలకు కాంట్రాక్టు దక్కేలా సహకరించారని అన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త గనులు సింగరేణికి రావడం మంచిదేనని అన్నారు. వేలంపాటలో పాల్గొనడానికి బదులుగా ఈ బ్లాకుల్ని సింగరేణి సంస్థకే అప్పగించాలని అన్నారు.
రెండున్నరేండ్ల క్రితం నాలుగు బొగ్గు బ్లాకుల్ని వేలం వేయడానికి బొగ్గు మంత్రిత్వశాఖ వేలం నిర్వహిస్తే అందులో పాల్గొనకుండా ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ వేలంలో మాత్రం సింగరేణి పాల్గొన్నదన్నారు. నాలుగు బ్లాకులకు జరిగే వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకున్నా దాన్ని బైపాస్ చేసి దూరంగా ఉంచి ఆ రెండు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసి ప్రభుత్వరంగ సంస్థకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఆ రెండు బ్లాకులు ఇంకా ఫంక్షనింగ్‌లోకి రానందున వాటిని సింగరేణికే అప్పగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పదో విడత వేలంపాటలో భాగంగా శుక్రవారం ప్రారంభమయ్యే వేలం ప్రక్రియలో శ్రావణ్‌పల్లి బ్లాకును నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికి అప్పగించాలన్నారు. ఈ మేరకు బొగ్గు మంత్రితో మాట్లాడతానని తెలిపారు. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాకలన్నింటినీ దానికే అప్పగించాలని కోరుతామన్నారు.
తెలంగాణకు సింగరేణి కొంగుబంగారమని, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 76 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నదని, దాన్ని పదిలంగా కాపాడుకోవడం రాష్ట్రానికి అవసరమన్నారు. లేదంటే సింగరేణి ఒక భవిష్యత్తుగా కాక కేవలం ‘చరిత్ర’గా మిగిలిపోయే ప్రమాదముందన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తిగా బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సింగరేణి భవిష్యత్తు కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రధాని మోడీతో మీటింగ్ కోసం తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకలజనుల సమ్మెలో సింగరేణి సత్తా ఏంటో దేశానికే తెలిసొచ్చిందని, మన ప్రాంత గనులు మనకే ఉండాలని, ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. గతంలో వేలంలో ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్న రెండు బ్లాకుల్లో ఇప్పటికీ బొగ్గు తవ్వకాలు లేనందున వాటిని ఇప్పటికైనా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
నిజంగా సింగరేణికి మేలు చేయాలనే ఉద్దేశమే బీఆర్ఎస్‌కు ఉన్నట్లయితే ఆనాడు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణకు ఎందుకు మద్దతు పలికిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇక్కడ వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసి ఒడిషాలో మాత్రం పాల్గొనేలా నిర్ణయం తీసుకోడాన్ని తప్పుపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలోనే సింగరేణి విధ్వంసానికి గురైందని, గనులు మూతపడ్డాయని, కొత్త గనులు రాలేదని, కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఇప్పటికైనా సింగరణి సంస్థను, దాని ఆస్తులను కాపాడుకోవాలని, కొత్త గనులు పొందడం ద్వారా విస్తరించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం 40 గనులతో ఏటా 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర, సంస్థ ప్రయోజనాల కోసం గతంలో బొగ్గు శాఖ మంత్రిని కలిశామని, ఇప్పుడు కూడా ఆ శాఖ మంత్రిని కలుస్తామని, అప్పటికీ ఫలితం లేకపోతే ప్రధానిని కూడా కలుస్తామన్నారు.