దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో కలెక్టర్లకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలన్నారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు.