నంది ఆవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాలకు నిధులు కేటాయించి, నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Update: 2024-01-20 15:45 GMT

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాలకు నిధులు కేటాయించి, నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు నూతన ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖ‌ల ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని. పదిసార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

అనంతరం రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రోడ్ల నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వివరించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (త్రిబుల్ఆర్)కు సంబంధించి ఆలైన్‌మెంట్‌పై కీలక చర్చ జరిగింది. దీనిపై డిప్యూటి సీఎం భట్టి మాట్లాడుతూ.. భ‌విష్యత్తు త‌రాల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని, అందుకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీగా ఎంతో పారదర్శకంగా ఆలైన్‌మెంట్ ఉండాల్సిన అవ‌స‌రముందని అధికారుల‌కు సూచించారు. ఇష్టారాజ్యంగా కాకుండా ఓ క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా, ఆమోదయోగ్యంగా ఉండేలా అలైన్ మెంట్‌ను రూపొందించాలని ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నల్గొండ, హైదరాబాద్‌లో కలెక్టరేట్ల నిర్మాణాలు, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్ యూబీలు, వీయూబీ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల ప్రతిపాదనలను భట్టి పరిశీలించారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్ వర్క్ పెంచేందుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలను సైతం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో సీఐఆర్ఆఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్ధిక మంత్రి అంగీకారం తెలిపారు. ఇవే కాకుండా చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరముంటుందని, అందుకు సరిపడా నిధులు కేటాయించాల‌ని కోమ‌టి రెడ్డి కోరారు.

సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడలని డిప్యూటీ సీఎం భట్టి సినిమాటోగ్రఫీ అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ వంటి మహమ్మారి వ్యసనాల వ్యతిరేఖ ప్రచారంలో సినిమా సెలబ్రిటీలు పాల్గొనేలా, అందుకు వారు అంగీకరించేలా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. చ‌ల‌న చిత్ర పరిశ్రమ న‌టీ, న‌టుల‌ను గౌరవిస్తూ ప్రధానం చేసే నంది అవార్డులపై త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్న నిర్మాత‌ల సినిమాలను విడుద‌ల చేయ‌డానికి ఎదుర‌వుతున్న ప్రతిబంధకాలను తొల‌గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ పరిధిలోని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఉన్న భూములు ఆన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలని సూచించారు. థియేటర్లలో విక్రయించే స్నాక్స్ రేట్లు సినిమా టికెట్ కన్నా అధికంగా వసూలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమ‌టిరెడ్డిలు ప్రస్తావించారు.

అన్ని మెట్రో నగరాల్లో అమలవుతోన్న రేట్ల కంటే హైదరాబాద్ సినిమా హాళ్లలో అమ్ముతున్న రేట్లు వందల శాతం ఎక్కువగా ఉన్నాయని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఆన్ లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక, నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, రోడ్లు భవనాల శాఖా ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హ‌రిత‌, డిప్యూటి సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఈఎన్‌సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డి, సతీష్‌తో పాటు ఐ అండ్ పీఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News