Deputy CM Bhatti: వడ్డీ రేటు తగ్గించండి.. కేంద్ర మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి రిక్వెస్ట్

రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న దయనీయమైన ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీ రేటును తగ్గించాలని కోరారు.

Update: 2024-08-24 15:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న దయనీయమైన ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీ రేటును తగ్గించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ఆమెతో సమావేశమైన భట్టి ఎక్కువ వడ్డీకి గత ప్రభుత్వం రుణాలు తెచ్చుకోవడంతో వాటిపై వడ్డీని చెల్లించడం భారంగా మారిందన్నారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు చెల్లించే పెన్షన్ల కంటే చాలా ఎక్కువ స్థాయిలో పాత అప్పులపై వడ్డీలకు చెల్లించాల్సి వస్తున్నదని వివరించారు.

గత ప్రభుత్వం రూ. 31,795 కోట్లను అధిక వడ్డీకి తీసుకొచ్చిందని, ఇప్పుడు ఆ వడ్డీ రేటును తగ్గించాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీని చెల్లించడం రాష్ట్రానికి భారంగా మారిందన్నారు. దీనికి తోడు గత ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల (కార్పొరేషన్ల) పేరుతో బడ్జెటేతర రుణాలు చేసిందని, వాటి చెల్లింపు (అసలు, వడ్డీ కలిపి) రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో పాత అప్పులపై వడ్డీ శాతాన్ని రీషెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కోరారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాకు వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్) నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఫండ్స్ గురించి కూడా గుర్తు చేసినట్లు తెలిపారు. మొత్తం ఎనిమిది అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు.

విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధులను సత్వరం చెల్లించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు వివరించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు సంవత్సరానికి రూ. 450 కోట్ల చొప్పున అందాల్సి ఉన్నదని, కానీ గత నాలుగేళ్లుగా అందకుండా కేంద్రం దగ్గరే బకాయిలుగా ఉండిపోయాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులనూ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. 


Similar News