ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ నిర్వీర్యం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేశారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Update: 2023-06-17 16:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేశారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి కావాల్సిన వ్యక్తులు, బంధువులకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే వ్యూహాత్మకంగా టీఎస్పీఎస్సీలో ఆయన అనుచరులు, బంధువులకు బహుమానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారని, దాని పర్యవసానాలే ఇటీవల బయటపడ్డ వరుస పేపర్ లీకేజీలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్పీ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్‌కు రాజ్యాంగబద్ధ సంస్థలపై ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు.

రాజ్యాంగంలో 316 అధికరణ ప్రకారం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంలో పాటించాల్సిన నియమ, నిబంధనలు కేసీఆర్ ఇవేవీ పట్టనట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలపై జరిగిన అన్యాయాలపై భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్‌కు పిర్యాదు చేసినా అక్కడి నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. అందుకే తెలంగాణలో ఉన్న 35 లక్షల నిరుద్యోగుల పక్షాన బీఎస్పీ న్యాయం కోసం పోరాడుతుందన్నారు. కానీ నియంత కేసీఆర్ ప్రభుత్వం 42 మంది బీఎస్పీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారని తెలిపారు. ఇప్పుడున్న జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలు, పారదర్శకంగా జరుగుతాయానే నమ్మకం ఉద్యోగార్థులకు లేదన్నారు.

ఇప్పుడున్న కమిషన్ సభ్యులకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వెల్లడించారు. లేదంటే కేసీఆర్ కమిషన్ చైర్మన్, సభ్యులు స్వచ్చందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేయాలని సూచించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మొట్టికాయలు వేసినా సభ్యులను తొలగించకపోతే, ఇంకెప్పుడు తొలగిస్తారు? అని, నిరుద్యోగులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘‘బహుజన రాజ్యంలో పారదర్శకమైన పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసుకొని, మన ఉద్యోగాలను మనమే హక్కుగా పొందుదాం. అప్పటి వరకు బీఎస్పీ నిద్రపోదు, నిద్రపోనివ్వదు’’ అని పేర్కొన్నారు.


Similar News