బీసీ గురుకుల కాలేజీల్లో డిగ్రీ అగ్రికల్చర్ అడ్మిషన్లు
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ప్రాసెస్ మొదలైనది.
దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ప్రాసెస్ మొదలైనది. బీఎస్సీ (హన్స్) మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఈ నెల 12వ తేదీ ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ ఇఎపీసెట్- 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినీలు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వనపర్తి, కరీంనగర్ లోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థినీలు వెంటనే దరఖాస్తు చేయాలని సూచించారు.
ఇఎపీసెట్-2024 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థినీలను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. సీటు సాధించిన విద్యార్థినీలు కాలేజీ హాస్టల్ లోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థినీ తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షా యాభై వేలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ.రెండు లక్షలకు మించరాదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయ పనివేళల్లో 040-23328266 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.