హైడ్రామా నడుమ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ ప్రారంభం
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన దీక్షా దివస్‌లో హైడ్రామా నెలకొంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన దీక్షా దివస్‌లో హైడ్రామా నెలకొంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివస్ వేడుకలతో పాటు రక్తదాన శిబిరాన్ని పార్టీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా తెలంగాణ భవన్‌కు చేరుకోగా ఇంతలో అక్కడికి ఎలక్షన్ కమీషన్ స్క్వాడ్ టీమ్ వచ్చింది. దీక్షా దివస్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమం చేయవద్దని సూచించారు.
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ లీగల్ టీమ్‌కు చెందిన సోమ భరత్ సీపీతో చర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన సంప్రదింపుల తర్వాత తెలంగాణ భవన్ లోపల మాత్రమే కార్యక్రమం నిర్వహించుకోవాలని, తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాల వేయవద్దని డీసీపీ తేల్చి చెప్పారు. అధికారుల ఆదేశాలతో తెలంగాణ విగ్రహానికి పూలమాల వేయకుండానే భవన్ లోపల మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు.