పెద్ద చెరువు కింద క్రషర్​ క్వారీ పనులు.. మళ్లీ షురూ!

పటాన్​ చెరు మండలం లకుడారం పెద్ద చెరువు కింద క్రషర్ క్వారీ పనులు మళ్లీ మొదలయ్యాయి.

Update: 2023-03-23 02:25 GMT

పటాన్​ చెరు మండలం లకుడారం పెద్ద చెరువు కింద క్రషర్ క్వారీ పనులు మళ్లీ మొదలయ్యాయి. చెరువు, గ్రామానికి ముంపు వాటిల్లుతుందని తెలిసినా అధికారులు అక్కడ మైనింగ్‌కు అనుమతులిచ్చారు. క్వారీ పనులు చేపట్టడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనకు దిగివచ్చిన అధికారులు కొద్ది రోజుల క్రితం క్వారీ పనులను నిలిపివేయించారు.

మైనింగ్​, రెవెన్యూ, నీటి పారుదల శాఖలు సంయుక్త సర్వే చేపట్టి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్​ ఆదేశాలిచ్చారు. అయినా అవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు తిరిగి క్వారీ పనులు మొదలెట్టారు. దీంతో లకుడారం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ వల్ల చెరువుతో పాటు గ్రామానికి ముంపు వాటిల్లుతుందని, వెంటనే అనుమతిని రద్దు చేయాలని నిరసన చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

దిశ, సంగారెడ్డి బ్యూరో / పటాన్​ చెరు: పెద్ద చెరువు కింద క్రషర్ క్వారీ పనులు మళ్లీ మొదలయ్యాయి. రైతులు నిరసనలతో దిగివచ్చిన అధికారులు క్వారీ పనులు నిలిపేయమని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్త సర్వే చేపట్టి సర్వే రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ అదేశాలిచ్చారు. అయితే కొద్ది రోజులు పనులు ఆపిన కాంట్రాక్టర్లు సర్వే రిపోర్ట్ రాకుండానే తిరిగి చెరువు కింద క్వారీ పనులు మళ్లీ మొదలు పెట్టారు.

ఓ వైపు చెరువు కట్టకింద మైనింగ్ పనులు చేపట్టడం చెరువుకు ప్రమాదమని లకుడారం రైతులు, గ్రామస్తులు దీక్షలు చేస్తున్నారు. క్రషర్ అనుమతులు రద్దు చేయాలని 28 రోజులుగా నిరవధిక నిరసన చేపడుతున్నారు. క్రషర్ మొదలైతే చెరువు ప్రమాదంలో పడుతుందని, చెరువుకు గండి పడితే ఊరంతా మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళనలతో పనిలేదన్నట్లుగా, సంయుక్త సర్వే రిపోర్ట్ రాకుండానే మళ్లీ పనులు మొదలు పెట్టడం పట్ల పటాన్ చెరు మండలం లకుడారం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు ఎలా వచ్చాయి..?

లకుడారం గ్రామంలో కంకర క్వారీకి అనుమతుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. లకుడారం గ్రామంలోని సర్వేనెంబర్ 747లో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పటాన్ చెరుకు చెందిన ఓ సంస్థకు మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారు. అయితే సదరు సంస్థకు చెరువు కట్టకింద అనుమతులు ఇవ్వడం చర్చానీయాంశమైంది. చెరువుకు ప్రమాదం జరుగుతుందని క్వారీ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అనుమతులు ఇవ్వడాన్ని గ్రామస్తులు తప్పుబడుతున్నారు. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్నపెద్ద చెరువు కింద 600 మంది రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెరువు ప్రమాదం జరిగితే తమ బతుకులు రోడ్డున పడతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ క్వారీ మొదలైతే చెరువు కట్ట బీటలు పడుతుందంటున్నారు.

దీక్షలతో దిగివచ్చిన అధికారులు...

గ్రామస్తులు, రైతుల నిరసన దీక్షలతో దిగివచ్చిన అధికారులు క్వారీ పనులను నిలిపివేశారు. క్వారీ అనుమతులు, రైతులు ఆందోళనలపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. పనులు నిలిపివేయడంతో గ్రామస్తులు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ పూర్తిగా క్వారీ అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని దీక్షలను గ్రామస్తులు కొనసాగిస్తూనే ఉన్నారు. 28 రోజులుగా గ్రామంలో క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు దీక్షలు చేయడం చర్చకు దారితీస్తున్నది.

తిరిగి మళ్లీ పనులు మొదలు...

గ్రామస్తుల నిరసన దీక్షలతో కొద్ది రోజులు పనులు నిలిపివేసిన కాంట్రాక్ట్ సంస్థ తిరిగి మళ్లీ మొదలు పెట్టడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. సర్వే రిపోర్టు లేకుండా, గ్రామస్తులను ఆందోళనలు ఏ మాత్రం లెక్క చేయకుండా మళ్లీ పనులు మొదలు కావడంపై దీక్ష చేస్తున్న గ్రామస్తులు మండి పడుతున్నారు. అధికారులు కనీసం ఎటువంటి క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా చెరువు ఎలా అనుమతులు ఇచ్చారని, కొద్ది రోజులు పనులు నిలిపివేసి మళ్లీ ఎందుకు మొదలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. పనులు నిలిపివేయాలని, లేదంటే ఆందోళన తీవ్ర చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. దీక్షలు ఇలాగే కొనసాగిస్తామంటున్నారు. ఈ వ్యవహారం తీవ్రతరం కాకముందే అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉన్నది.

Tags:    

Similar News