21 వేల ఎకరాల్లో పంట నష్టం.. CM రివ్యూ చేసిన గంటల్లోనే రిపోర్టు రెడీ!

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అంచనా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన గంటల వ్యవధిలోనే జనగామ జిల్లా వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది.

Update: 2023-04-23 17:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అంచనా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన గంటల వ్యవధిలోనే జనగామ జిల్లా వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. జిల్లావ్యాప్తంగా మొత్త, 21,559 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించింది. ఇందులో 20 వేల ఎకరాలకు పైగా వరి పంటే నష్టపోయినట్లు తేలింది.

జిల్లాలో ఎక్కువగా బచ్చన్నపేట మండలంలోనే ఈ నష్టం జరిగినట్లు గుర్తించింది. కరీంనగర్ జిల్లా రూరల్, చొప్పదండి మండలాలు సహా మరికొన్ని చోట్ల జరిగిన పంట నష్టం వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉన్నది. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న అధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టాన్ని అంచనా వేసేందకు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమగ్రమైన వివరాలతో కూడిన నివేదికలను తెప్పించాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు. అందులో భాగంగా తొలుత జనగామ జిల్లా నుంచి రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. మిగిలిన జిల్లాల నుంచి కూడా ఒకటి రెండు రోజుల్లో అందనున్నది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ పనుల్లోనే ఉన్నందున కొన్ని జిల్లాల్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్లు రద్దు చేశారు.

అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుని రైతులకు తగిన పరిహారాన్ని చెల్లించడంపై సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నది. పలు జిల్లాల్లో వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు, వడగండ్లు పడడంతో దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది.

గత నెలలో నాలుగు జిల్లాల్లో సీఎం పర్యటన

అకాల వర్షాలతో పంటలకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 23న నాలుగు జిల్లాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటలకు జరిగిన నష్టం గురించి అక్కడి అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక జీవో జారీచేసి ఎకరానికి రూ. 10 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. సీఎం హామీ మేరకు జీవో జారీ అయినా రైతులకు పంట నష్టం మాత్రం ఇంకా అందలేదు.

మొత్తం 2.88 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి పంట నష్టానికి సంబంధించిన సమగ్ర నివేదికలు అందాయి. కానీ రైతులకు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ నుంచి నిదులు విడుదల కాలేదు. ఇప్పుడు మరోసారి అన్ని జిల్లాల నుంచి నివేదికలను కోరినా సాయం ఎప్పుడు అందుతుందనేది రైతుల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News