ఈనెల 16 నుంచి ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’.. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కొద్ది రోజులుగా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు.

Update: 2023-07-02 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కొద్ది రోజులుగా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. ఇది కాస్త ఇప్పుడు ఉద్యమంగా మారనుంది. ఈనెల 16వ తేదీ నుంచి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను ప్రారంభించనున్నట్ల సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని తమ సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నారన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1,72,000 సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ను నిలిపేసిందని విమర్శలు చేశారు. సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ విధానాన్‌ని తిరిగి తెలంగాణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రత లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో రథయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 33 జిల్లాలకు చెందిన సీపీఎస్ ఉద్యోగులు రథయాత్రలో పాల్గొనాలన్నారు. ఈ సంకల్ప యాత్ర ఈనెల 16 నుంచి 31 వరకు అన్ని జిల్లాల్లో చేపడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అభీ నహీతో.. కభీ నహీ అనే నినాదంతో సాగుతుందన్నారు. అనంతరం ఆగస్టు 12వ తేదీన చలో హైదరాబాద్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. రథయాత్ర పోస్టర్, కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News