రాష్ట్రంలో మా లక్ష్యం అదే.. సీపీఎం నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో(జనచైతన్య యాత్ర) బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో(జనచైతన్య యాత్ర) బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగేలా బస్సుయాత్ర ప్రణాళికను రూపొందించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శుక్రవారం ఆయన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిని ఎండగట్టడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనున్నట్లు వెల్లడించారు. మొదటి యాత్ర ఈ నెల 17న వరంగల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు.
ఈ నెల 23న అదిలాబాద్‌లో రెండో యాత్రను పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రారంభిస్తారని, 24న నిజామాబాద్‌లో మూడో యత్రను పొలిట్ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బస్సు యాత్ర ముగింపు ఉంటుందని, సభకు ముఖ్య అతిథిగా ప్రకాశ్ కరత్ వస్తారని వివరించారు. యాత్రలో పది లక్షల కరపత్రాలు పంచుతామని, రెండు లక్షల పోస్టర్లు, బీజేపీ ప్రమాదంపై బుక్‌లెట్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాషాయమూకను అడ్డుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, ఎస్ వీరయ్య పాల్గొన్నారు.