ప్రధాని మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారు: CPI నారాయణ
ప్రధాని మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని, ఇందులో 29 మంది విదేశాలకు పారిపోగా మరో దత్త పుత్రుడు అదానీ ఇక్కడే ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని, ఇందులో 29 మంది విదేశాలకు పారిపోగా మరో దత్త పుత్రుడు అదానీ ఇక్కడే ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. దత్తపుత్రుడు అదానీకి దేశ సంపదను మోడీ ప్రభుత్వం అప్పగిస్తోందని విమర్శించారు. అదానీకి ఇచ్చిన రాయితీల్లో పది శాతం ఖర్చు చేసినా పేద ప్రజానికానికి ఇండ్లు, ప్రాజెక్ట్‌లు నిర్మించవచ్చని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు “బీజేపీ కో హఠావో దేశ్ కో బచావో” అనే నినాదంతో చేపట్టిన “ఇంటింటికి సీపీఐ” యాత్ర ప్రారంభ సభను శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న నాయకత్వం ఏదైనా ఉన్నదంటే అది మోడీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ, వారికి మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాష్ట్రాల్లో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని ఇంటికి పంపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
ప్రజల గుండెల్లోని సీపీఐని ఎన్నికల సంఘం చేరపలేదు: కూనంనేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో కమ్యూనిస్టు పార్టీ పట్ల ఉన్న స్థానాన్ని ఏ ఎన్నికల కమిషన్ చెరపలేదని రుజువు చేయాలని పిలుపునిచ్చారు. ‘నీలాంటి ఎన్నికల కమిషన్లు ఎన్నో మారిపోతాయని, కానీ కమ్యూనిస్టు పార్టీ’ అలాగే నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దోపిడీ దారుల గుండెలు అదిరే పద్ధతుల్లో సీపీఐ సింహగర్జన చేస్తుందని, నడుస్తూనే ఉంటుందన్నారు. బ్రిటిష్ కాలంలో కూడా సీపీఐ గుర్తింపును రద్దు చేశారని, కానీ తిరిగి పుంజుకున్నామని, ఇప్పుడు బెబ్బులిలా ముందుకెళ్తామని చెప్పారు. భారతదేశ చిత్ర పటం నుంచి సీపీఐని చెరిపేసే హక్కు ప్రధాని మోడీకి ఎవరిచ్చారని, మోడీ పలుకులతో పలికే చిలుక పంజరంలోని ఎన్నికల కమిషన్ ఆ అధికారం ఎవరిచ్చారో తేల్చుకుంటామని హెచ్చరించారు. అత్యున్నత పార్లమెంట్‌ను పనికిరాని వేదికగా తయారు చేశారని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి నరసింహ, ఎన్.బాలమల్లేష్, వి.ఎస్.బోస్ తదితరులు పాల్గొన్నారు.