దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎల్‌ఐసీకి నష్టాలు: కూనంనేని
భారత దేశ చరిత్రలో నష్టాలు అనేవి లేకుండా బంగారు బాతుగా ప్రసిద్ధి చెందిన ఎల్‌ఐసీలో ప్రధాని మోడీ, ఆదానీల కుమ్మక్కుతో మొదటిసారిగా శుక్రవారం రూ.3,200 కోట్ల నష్టం
దిశ, తెలంగాణ బ్యూరో: భారత దేశ చరిత్రలో నష్టాలు అనేవి లేకుండా బంగారు బాతుగా ప్రసిద్ధి చెందిన ఎల్‌ఐసీలో ప్రధాని మోడీ, ఆదానీల కుమ్మక్కుతో మొదటిసారిగా శుక్రవారం రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల క్రితం హిండెన్‌బర్గ్ అదానీ షేర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన రోజే రూ.30 వేల కోట్లు నష్టం వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన 80 వేల కోట్ల లాభాల్లో 30 వేల కోట్ల నష్టం జరిగినా, ఇంకా 50 వేల కోట్లు లాభంతోనే ఉన్నట్లుగా ప్రభుత్వం దబాయించిందన్నారు. మొత్తంగా రూ. 83,200 కోట్లు ఎల్‌ఐసీకి నష్టం వచ్చిదని ప్రకటించారు. ఎల్‌ఐసీకి వచ్చిన ఈ నష్టం, అలాగే ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర పెట్టుబడులు పెట్టిన సంస్థలకు వచ్చిన ఈ నష్టాలు ఇంతటితో ఆగే విధంగా కనబడటం లేదని పేర్కొన్నారు.
అదానీ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన దేశ పెన్షన్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నష్టపోయాయని వెల్లడించారు. అదానీ సంపద ఇప్పటికే కేవలం 30 రోజుల్లో 12 లక్షల కోట్లకుపైగా షేర్ మార్కెట్‌లో నష్టపోవడం జరిగిందన్నారు. ఆ ప్రభావం ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజలపై, మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కూనంనేని పేర్కొన్నారు. ఈ దశలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆదాని ఆస్తులను స్వాధీనపర్చుకొని, భవిష్యత్‌లో నష్టాలు జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశ ఆర్థిక సార్వభౌమత్వమే ప్రమాదంలో పడుతుందని కూనంనేని హెచ్చరించారు.