Election Results: జూన్ 4 ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు.. ఎక్కువ మంది ఉండొద్దు!: సీఈవో వికాస్‌రాజ్ కీలక సూచనలు
తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు, బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని, ఎక్కువ మంది గుమిగూడ వద్దన్నారు. 2 లక్ష 18 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వాటి లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యకంగా ఉంటాయని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండవని వెల్లడించారు. కౌంటింగ్ రోజు మద్యం షాపులు బంద్ ఉంటాయని వివరించారు.
చొప్పదండి, యాకుత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా మొత్తం 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. మిగిత అన్ని చోట్ల దానికంటే తక్కువగా ఉంటాయన్నారు. అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు మూడు సెగ్మెంట్లలో ఉంటాయని, ఆర్మూర్, భద్రాచలం, ఆశ్వరావుపేటలో ఉంటాయన్నారు. మిగతా దగ్గర 18,19, 20 వరకు రౌండ్లతో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. స్టాఫ్ అందరికీ కూడా లెక్కింపు ప్రక్రియపై ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అలానే ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరగాలని చెబుతున్నారు.