బీఆర్ఎస్ పదేండ్ల పాలన విధ్వంసమే!

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను కాపాడాలంటూ ఉద్యమం నడుస్తున్నది. అక్కడ చెరువులు, కుంటలు, అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని, వాటికి ముప్పు వాటిల్లకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Update: 2025-04-07 02:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను కాపాడాలంటూ ఉద్యమం నడుస్తున్నది. అక్కడ చెరువులు, కుంటలు, అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని, వాటికి ముప్పు వాటిల్లకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కోటికి పైగా జనాభా ఉన్న సిటీకి లంగ్ స్పేస్ గా ఉన్న ఈ భూముల అమ్మకం ద్వారా సర్కారుకు ఎంత ఆదాయం వస్తుందో తెలియదు కానీ.. గత పదేళ్లుగా, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రకృతి విధ్వంసం జరిగిందనే డిస్కషన్ కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలోనే ప్రారంభమైన ఈ ఒరవడి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లుగా నిరాటకంగా కొనసాగినట్లు స్పష్టమవుతున్నది. కంచగచ్చిబౌలిలో భూములను వేలం వేయొద్దని.. ప్రకృతిని కాపాడాలంటూ ప్రస్తుతం గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్.. తన పదేళ్ల టర్మ్‌లో వందల ఎకరాల భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టి చేసింది కూడా ప్రకృతి ధ్వంసమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్ కు పక్కనే గండిపేట మండలం కోకాపేటలో గుట్టలు, చెట్లతో నిండిన ప్రభుత్వ భూములను వేలం వేశారు. అగ్రికల్చర్ వర్సిటీకి ఆనుకొని ఉన్న రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో ఎన్నో ఎకరాలను ప్రైవేటుపరం చేశారు. గతంలో అక్కడ ఎంతటి ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండేదో పాత గూగుల్ మ్యాప్స్ పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఎకరం రూ. వంద కోట్లు పలికిందని గొప్పగా ప్రచారం చేసుకున్నా.. అక్కడికి వచ్చే ప్రాజెక్టులతో రానున్న ముప్పు భవిష్యత్తులో తెలుస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీలింగ్ ల్యాండ్

1974-75లో అప్పటి కాంగ్రెస్ సర్కారు బుద్వేలు దళితులకు ఐదెకరాల వంతున అసైన్ చేసింది. సర్వే నం.283 నుంచి 299 వరకు సుమారు 182 ఎకరాలకు పైగా పేదలకు కట్టబెట్టారు. ఇందులో అత్యధికం సాగుకు అనుకూలంగా లేనిదే. ఈ ప్రాంతంలో ఓ ముస్లిం సంపన్న కుటుంబం నుంచి సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్న భూమి ఇది. అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు. సీలింగ్ సర్ ప్లస్ మాత్రమే. అయితే ఆ తర్వాత చంద్రబాబు హయాంలో పీవోటీ కింద పేదల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. రైతులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు మందలించడంతో నోటీసులు జారీ చేసి, వారి నుంచి రిప్లయ్ తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్బిట్రేషన్ చేసి హెచ్ఎండీఏ, అసైనీలకు మధ్య ఒప్పందం కుదిర్చారు. అసైనీలకు 800 గజాల వంతున, కబ్జాలో ఉన్న వారికి 200 గజాల వంతున ప్లాట్లు ఇచ్చే అంగీకారానికి వచ్చారు.

అయితే తెర వెనుక కొందరు పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ ల్యాండ్ రీఫామ్స్ (సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్) యాక్ట్, 1973 ప్రకారం సీలింగ్ భూములను అమ్మే అధికారం హెచ్ఎండీఏకు లేదు. ఈ చట్టం ప్రకారం గరిష్టంగా క్లాస్ కే కింద 54 ఎకరాలకు మించి ఒక హోల్డింగ్ ఉండరాదు. మిగతాది సీలింగ్ కింద ప్రభుత్వపరం అవుతుంది. ఈ భూమిని రీ అసైన్ చేయడం లేదంటే ఇండ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి మాత్రమే పరిమితమైంది. అయితే బుద్వేలులో సుదీర్ఘ కాలంగా కేసులు నడిచిన ఈ భూమిని అసైనీల నుంచి స్వాధీనం చేసుకున్నదన్న విషయం అందరికీ తెలిసింది. ఆ బాధితులకు 800, 200 గజాల వంతున ప్లాట్లు ఇచ్చే ఒప్పందం ప్రకారమే సెటిల్మెంట్ కుదిరింది. అంతకు ముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటప్పుడు నిర్మాణ సంస్థలకు వారి ఇష్టమొచ్చినట్లు అమ్మేయడం పై అనేక విమర్శలు వచ్చాయి.

కాంక్రిట్ జంగిల్ గా మారనున్న బుద్వేల్..

బుద్వేలులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణం ఉన్న 17 ప్లాట్లను వేలానికి సిద్ధం చేసింది. ఒకప్పుడు నగరానికి మంచినీటిని అందించిన హిమాయత్ సాగర్ పక్కనే ఈ స్థలం ఉంది. అగ్రికల్చర్ వర్సిటీని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం గుట్టలతో, ప్రకృతితో అలరారుతుండేది. అయితే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కు ఎలాంటి పరిమితులు లేవంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి భూములను వేలం వేసింది. మల్టిపుల్ యూజ్ జోన్ గా పరిగణించి.. ఇష్టారీతిన ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఎలాంటి రీక్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అవసరం లేకుండానే కమర్షియల్, రెసిడెన్షియల్, రిటెయిల్, ఎంటర్ టైన్మెంట్ వంటివి ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం కాంక్రిట్ జంగిల్ గా మారుతుందని పర్యావరరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హై రైజ్డ్ బిల్డింగ్స్..

బుద్వేల్ లోని 300 ఎకరాల్లో 100 ఎకరాలను రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం వేలం వేసింది. ఇక్కడ ఎకరానికి కనిష్ఠంగా 33.25 కోట్లు, అత్యధికంగా రూ.41.75 కోట్ల ధర పలికింది. బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొని భూములను దక్కించుకున్నాయి. ఆ తర్వాత భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి. ఐటీ హబ్ కు దగ్గరలో ఉన్న బుద్వేల్ లో హెచ్ఎండీఏ అభివృద్ది చేస్తున్న మౌలిక వసతులతో భారీ స్థాయిలో నివాస ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే ఇక్కడ పలు నిర్మాణ సంస్థలు అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నాయి.

ప్రకృతి వల్లే రూ. వందల కోట్లు

కోకాపేట భూముల వేలంలో రాజపుష్ప వంటి కంపెనీలదే ప్రధాన పాత్ర. నియోపోలిస్ ఫేజ్-2లో గ‌ల 3.6 ఎక‌రాల ప్లాట్‌ను ఎకరానికి రూ. 100.75 కోట్లు చెల్లించి హ్యాపీ మొబైల్స్ కంపెనీ సొంతం చేసుకున్నది. అయితే ఈ ప్లాట్‌ను కూడా రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్‌ కే డెవ‌ల‌ప్‌మెంట్‌కు ఇచ్చింది. ఇరు కంపెనీల మధ్య అంగీకారంతోనే వేలం పాటలో పాల్గొన్నట్లు చర్చ జరిగింది. హ్యాపీ మొబైల్ కంపెనీకి, నిర్మాణ రంగానికి అసలు సంబంధమే లేదు. కానీ ఆ యాజమాన్యం నిర్మాణ రంగంలోకి రావాలని ఉవ్విళ్లూరింది. అయితే రూ.100 కోట్ల ధర పలకడం వెనుక ప్రకృతే దాగి ఉన్నది. 3.6 ఎక‌రాల చిన్న ప్లాటుకు స‌రిగ్గా గండిపేట్ లేక్ వ్యూ ఉండ‌ట‌మే ప్రధాన కార‌ణం.

కోకాపేటలోని నియోపోలిస్ ఫేజ్-2 ప్రాంతం చూడ‌టానికి చాలా ఆక‌ర్షణీయంగా క‌నిపిస్తుంది. అక్కడి నుంచి ఉస్మాన్ సాగ‌ర్ కూడా కనిపిస్తుంది. ఎంఎస్ఎం ఫార్మాకెమ్ ప్రైవేటు లిమిటెడ్ ఎకరానికి రూ.73 కోట్లు, నవిత్రీస్ ఇన్వెస్ట్మెంట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ కలిసి ఎకరానికి రూ.75.50 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఎకరానికి రూ.68 కోట్లు, డెబ్లూయోక్, పి.మంగ్రామ్ ప్రాపర్టీస్ కలిసి ఎకరానికి రూ.75.25 కోట్లు, హ్యాపీ హైట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ కలిసి ఎకరానికి రూ.100.75 కోట్లు, ఏపీఆర్ గ్రూప్ ఎకరానికి రూ.67.25 కోట్లు, లక్ష్మీనారాయణ, శ్యాం సుందర్ రెడ్డిలు కలిసి ఎకరానికి రూ.70 కోట్లు పెట్టి కోనుగోలు చేశారు. వీరంతా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించి అంతకంతా సంపాదించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

విధ్వంసమే కదా!

కోకాపేట, బుద్వేలు భూములు ఎలా ఉన్నాయనేది, అక్కడ ఏమేం ఉన్నాయనేది గూగుల్ మ్యాపులు చెప్తున్నాయి. వేలానికి ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నష్టం ఎంత అనేది అంచనా వేయాలి. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలను ధ్వంసం చేశారు. ఎన్నో చెట్లను కొట్టేశారు. ఇది కూడా విధ్వంసమే కదా అన్న చర్చ నడుస్తున్నది. కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువులు, పక్షులు, నీటి వనరులు ఉండొచ్చు. అయితే విధ్వంసమనేది బీఆర్ఎస్ హయాం నుంచే మొదలైందని సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ నడుస్తున్నది.

Similar News