MLCs : మండలిలో సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్సీలు

శాసన మండలి(Legislative Council)లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్సీ(Council)లు స్పెషల్ మెన్షన్ కింద పలు సమస్యలపై తమ గళం వినిపించారు.

Update: 2024-12-21 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : శాసన మండలి(Legislative Council)లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్సీ(Council)లు స్పెషల్ మెన్షన్ కింద పలు సమస్యలపై తమ గళం వినిపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ 1000పైగా గురుకులాలు, 495 కేజీబీవీలు, 194ఆదర్శ పాఠశాలలున్నాయని వాటిలో పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ఎదురవుతున్న సమస్యలను రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం తగదన్నారు. గురుకులాల్లో సమస్యలను అతిగా ప్రచారం చేయడం ద్వారా అందులో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. నాణ్యమైన భోజనంతో పాటు అందులో పనిచేసే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ పెన్షన్ విధానం , పాత పెన్షన్ స్కీమ్ అమలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల హామీలో పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తామన్న హామీ దిశగా, కేంద్రం ఇచ్చిన 57ఉత్వర్వులు అమలు చేయడం ద్వారా ముందుగా కొంతమంది ఉద్యోగులకైనా మేలు చేయాలని, తద్వారా రూ.200కోట్ల మేర నిధులు రాష్ట్రానికి అందుతాయన్నారు.

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ మాట్లాడుతూ అక్రమ క్లినికల్ ట్రయల్స్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఎక్కడి జిల్లాల వారిగా అక్కడే వారికి డ్యూటీలు ఇవ్వాలని, కారుణ్య నియామకాల్లో వారికి స్థానమివ్వాలని కోరారు. అర్డర్ టూ సర్వే రద్దు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టి.రవిందర్ మాట్లాడుతూ స్పెషల్ మెన్షన్ లో లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్వీ రమణ మాట్లాడుతూ సర్వశిక్షాభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తాతా మధుసూధన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కోడండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బలిదానమైన వారి కుటుంబాలకు రూ.20వేల పింఛన్, ఇండ్ల స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బస్వరాజు సారయ్య మాట్లాడుతూ రజకుల కరెంటు బిల్లుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ వనదుర్గా ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ టూరిజం పాలసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కవులు, కళాకారుల ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఫ్రీ లాంచ్ అఫర్లతో అక్రమ వెంచర్ల ప్లాట్లను, నిర్మాణాలను విక్రయిస్తున్న అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ గొర్రెల స్కామ్ విచారణతో డీడీలు కట్టిన వారికి అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం చేయాలని కోరారు. కోటిరెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ క్వార్టర్స్ రిజిస్ట్రేషన్ల వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అనుమతించాలని కోరారు. గిరిజన సంక్షేమం శాఖకు 866తో పాటు తండాల్లో పంచాయతీ భవనాలకు మంజూరీ ఇచ్చి నిధులు ఇవ్వాలని కోరారు. మహ్మద్ అలీ మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థుల సమస్యలను, హామీల అమలుకు చర్యల తీసుకోవాలని కోరారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంబంధిత శాఖలకు పంపించి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

Tags:    

Similar News