మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యు
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిందని మంత్రి అన్నారు. ఈ బిల్లుకు దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్భంగా మండలిలో జరిగిన చర్చలో సభ్యులు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్రంలోనే అన్నివర్గాలకు చెందిన 33 శాతం మంది మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎంపికవుతున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ రాజ్యంలోనే ఈ అవకాశం లభించిందన్న విషయం గుర్తించాలని, సీనియర్ సభ్యులు జీవన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ గొప్ప నిర్ణయాలను ప్రస్తావించకుండా, కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకుండా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయం చేయడం దురదృష్టకరమని కవిత అన్నారు. మార్కెట్ కమిటీల కాలపరిమితిని ఏడాది నుండి రెండేళ్లకు పెంచడం మూలంగా ఆ కమిటీకి మార్కెట్ నిర్వహణ మీద సంపూర్ణ అవగాహన వస్తుందని, మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని సభ్యులు గంగాధర్ గౌడ్, వెంకట్రామ్ రెడ్డిలు అన్నారు.