వాళ్ల పేర్లు చెప్తే ఉద్యోగుల్లో వణుకు.. మాట విననివారిపై బదిలీ వేటు!
కాసులు కురిపిస్తున్న టీఎస్ఎండీసీపై కొందరు అధికారులు మక్కువ చూపిస్తున్నారు. డిప్యుటేషన్‌పై వచ్చి.. ఇక్కడే తిష్టవేస్తున్నారు. సెక్షన్లు మారుస్తూ రాజ్యమేలుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాసులు కురిపిస్తున్న టీఎస్ఎండీసీపై కొందరు అధికారులు మక్కువ చూపిస్తున్నారు. డిప్యుటేషన్‌పై వచ్చి.. ఇక్కడే తిష్టవేస్తున్నారు. సెక్షన్లు మారుస్తూ రాజ్యమేలుతున్నారు. అంతేకాకుండా అవుట్ సోర్సింగ్‌పై బంధువులనూ ఈ కార్పొరేషన్లోనే నియమించుకొని.. వారి చేత వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. ఇలా కొందరు అధికారులు రూ.వందల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సహకార శాఖ నుంచి వచ్చిన ఓ అధికారి ఇప్పటికే మూడుసార్లు ఎక్స్ టెన్షన్ చేయించుకున్నారు. మరోసారి ఇక్కడే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. పంచాయత్ రాజ్ శాఖ నుంచి వచ్చిన మరొకరు కూడా ఇక్కడే తిష్ఠ వేశారు. ఈ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ స్థాయిలో పని చేస్తున్న చాలా మంది ఇతర శాఖల నుంచి వచ్చిన వారే. కాసులు కురిపించే శాఖ కావడం వల్లే పైరవీలతో డిప్యూటేషన్ ఆర్డర్లు సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేడో, రేపో సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖపై సమీక్షించనున్న నేపథ్యంలో ఇక్కడ పని చేస్తున్న అధికారులపై ఫోకస్ పెట్టాలని అందులో పని చేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోరుతున్నారు. అవినీతి అధికారులను ఇంటికి పంపించేస్తే.. ఇసుక ద్వారా వస్తున్న ఆదాయాన్ని రూ.800 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు పెంచవచ్చని పేర్కొంటున్నారు.
బినామీల పేర్లతో ఆస్తులు..
వేరే శాఖ నుంచి టీఎస్ఎండీసీకి వచ్చిన ఒక అధికారి.. ఇక్కడే తిష్ట వేశారు. పదో తరగతి మాత్రమే చదివిన తన మేనల్లుడిని ఇందులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా నియమించుకున్నారు. అతడి ద్వారా వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి అత్తామామ, మేనల్లుడు, మేన కోడలు పేరిట ఉన్న ఆస్తులు లెక్కిస్తే ఊహకందనంతగా ఉంటాయని అంచనా. ప్రధానంగా షాద్ నగర్, భూత్పూరు, జడ్చర్ల వంటి ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ల్యాండ్స్ ని కొనుగోలు చేశారని సమాచారం. షాద్ నగర్ ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తే అతడి స్నేహితుడు కూడా బినామీగా ఉన్నట్లు తెలిసింది. సదరు అధికారి తన ఉద్యోగానికి ఎలాంటి సంబంధం లేని టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వంటి సెక్షన్లలో బాధ్యతలు నిర్వహించినట్లు టీఎస్ఎండీసీ మాజీ అధికారొకరు ‘దిశ’కు వివరించారు. అంతేకాకుండా నాల్గో సారి కూడా ఇక్కడే ఉండేలా ఆర్డర్ తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మైనింగ్ అంశం మీద ఎలాంటి అవగాహన లేకపోయినా.. పంచాయత్ రాజ్ రాజ్ శాఖకు చెందిన ఓ అధికారి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో టీఎస్ఎండీసీలో డిప్యూటేషన్ పై వచ్చి ఇప్పటికీ కొనసాగుతున్నారు. అంతేకాకుండా కొందరు అధికారులు ఓవర్ లోడ్ కి రూ.3 వేలు, జీరో టూ జీరో రూ.25 వేలు వసూలు చేసేందుకు తమ బంధుగణాన్ని నియమించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పులో దొరక్కుండా ఉండేందుకు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టు అధికారి మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే మూడు జిల్లాలను వదిలించుకొని.. ఒక్క జిల్లాకే పరిమితమయ్యారు. రేవంత్ సర్కారు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో.. తప్పులో దొరక్కుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరో ప్రాజెక్టు అధికారికి భూపాలపల్లి, ములుగు జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది.
బిల్లుల్లోనూ గోల్ మాల్..
బీఆర్ఎస్ ఏలుబడిలో తమ పలుకుబడిని ఉపయోగించుకొని కొందరు అధికారులు ఏడేనిమిదేండ్లుగా టీఎస్ఎండీసీలోనే కొనసాగుతున్నారు. ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్ కి మారుతూ రాజ్యమేలువుతున్నారు. టీఎస్ఎండీసీ స్టేషనరీ బిల్లులపై ఆరా తీసినా.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతున్నదో అంచనా వేయొచ్చని కింది స్థాయి సిబ్బంది అంటున్నారు. అంతా ఆన్ లైన్ అయినా.. స్టేషనరీ పేరిట రూ.లక్షలు ఖర్చు పెట్టినట్లు బిల్లులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పర్యటనలు, వెహికిల్ బిల్లుల పేరిట లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్లు అలిగేషన్స్ ఉన్నాయి.
విననివారిపై వేటు
ఈ కార్పొరేషన్ లో సుమారు 290 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే వసూళ్లకు సహకరించకుంటే ఎక్కడో దూరప్రాంతంలో బదిలీ చేస్తున్నారని, అయినా వినకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. అధికారుల ఆస్తులపై దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయని పేర్కొంటున్నారు. మైనింగ్ పై అవగాహన కలిగిన అధికారులను నియమిస్తే ఆదాయం రెట్టింపు చేసుకోవచ్చని ఇక్కడి ఉద్యోగులు చెప్తున్నారు. టీఎస్ఎండీసీలో నిజాయితీగా పని చేసి రిటైరైన వారి సలహాలు తీసుకుంటే కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.