బీజేపీలో జోష్ నింపుతున్న 'కార్నర్' మీటింగ్స్! ఇక నయా ప్లాన్

రాష్ట్రంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా.. కాషాయ నేతల్లో జోష్ నెలకొంది.

Update: 2023-02-23 02:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా.. కాషాయ నేతల్లో జోష్ నెలకొంది. ఇందుకు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగులు సక్సెస్ కావడమే కారణం. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సొంత సెగ్మెంట్లలోనే అనుకున్న స్థాయిలో సభలు సక్సెస్ కావడంతో కమలం నేతలు ఆనందంలో మునిగిపోయారు.

ఇక ముందు పార్టీ శ్రేణులు మరింతగా పని చేసేందుకు బూస్ట్‌లా సభలు ఉన్నాయని కమలనాథులు పేర్కొంటున్నారు. ఇతర చోట్ల జరిగే సభలు ఒక ఎత్తు, ఆయా సెగ్మెంట్లలో జరిగే సభలు మరో ఎత్తు అని చెబుతున్నారు. 12 మంది ప్రత్యేక బృందంతో కూడిన ప్రత్యేక కమిటీ ఎప్పటికప్పుడు నేతలను సమన్వయం చేస్తూ సభలను సక్సెస్ చేస్తూ ముందుకెళ్తున్నది.

ఆ మూడు సెగ్మెంట్లలో..

రాష్ట్రంలో 11 వేల సభలను టార్గెట్‌గా పెట్టుకుని బీజేపీ నిర్వహిస్తున్నది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్‌కు కనీసం 80 నుంచి వంద చొప్పున నిర్వహించాలని ఫిక్స్ చేసుకుంది. ఇందులో భాగంగా గజ్వేల్ సెగ్మెంట్‌లో మొత్తం 88 సభలు చేపట్టాలని భావించగా మంగళవారం నాటికి 45 పూర్తయ్యాయి. సిద్దిపేట సెగ్మెంట్‌లో 70 టార్గెట్ పెట్టుకోగా.. 36 కంప్లీట్ అయ్యాయి.

సిరిసిల్ల సెగ్మెంట్‌లో 108 టార్గెట్ కాగా.. 52 పూర్తి చేశారు. ఈనెల 25లోపు మిగిలిన మీటింగ్స్ పూర్తి చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన సొంత సెగ్మెంట్లలో సభలు భారీగా సక్సెస్ అవుతున్నాయంటే వారి పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు.

ఆ లోపు పూర్తి చేసేందుకు..

బీజేపీ 'ప్రజా గోస-బీజేపీ భరోసా' ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలోని శక్తి కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పార్టీ ఆశించిన విధంగా సత్ఫలితాలిస్తున్నాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు. 10 రోజులుగా దాదాపు 6 వేలకు పైగా సభలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా 1,180 సభలు జరిగాయి. మరో 1,100 మీటింగులతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో నిలిచింది.

కాగా హైదరాబాద్ లో అత్యల్పంగా 360 మాత్రమే పూర్తయ్యాయి. మరోవైపు పార్టీ ప్రభావం పెద్దగా లేదని భావిస్తున్న ఖమ్మం జిల్లాలోనూ 370కి పైగా నిర్వహించడం విశేషం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఊహించని విధంగా 520 సభలు పూర్తి కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 870 నిర్వహించాల్సి ఉంది. మరో మూడు రోజులు సమయంలో మిగిలి ఉన్నందున్న ఆలోపు పూర్తి చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తు్న్నది.

దాడులు.. నిరసనలు చేస్తుండగా..

స్ట్రీట్ కార్నర్ మీటింగులకు అధికార పార్టీ నుంచి అక్కడక్కడా నిరసనలు, దాడులు ఎదురవుతున్నాయని కమలనాథులు చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడలో బీఆర్ఎస్ నేతలు మీటింగులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు పార్టీలూ దాడుల చేసుకునే వరకు వెళ్లాయి. మహబూబాబాద్‌లోనూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని దాడి చేయడంతో బీజేపీ నేతలు అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.

బోధన్, సత్తుపల్లి సెగ్మెంట్లతో పాటు హైదరాబాద్ పాతబస్తీలోనూ అధికార పార్టీతోపాటు ఎంఐఎం నేతలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతూ మీటింగులను అడ్డుకునేందుకు యత్నించారు. ఇతర పార్టీల నేతలు దాడులకు దిగటంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తమకు ఆదరణ పెరుగుతుండడంతో తట్టుకోలేకనే దాడులకు దిగుతున్నారని మండిపడుతున్నారు.

తాజాగా కోదాడ, ఖమ్మంలోనూ ఇవే తరహా దాడులు బీజేపీ నేతలపై జరిగాయి. వీటిపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై క్లారిటీ ఇవ్వడం, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేస్తున్న మోసాలను వివరిస్తే దాడులు చేస్తారా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉందని రెచ్చిపోవద్దని, ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేసీఆర్ ను పలువురు హెచ్చరిస్తున్నారు.

ఓర్వలేకనే దాడులు

రాష్ట్రంలో స్ట్రీట్ కార్నర్ మీటింగులకు అనూహ్య స్పందన వస్తుండగా ఓర్వలేకనే బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు దాడులకు పాల్పడుతున్నారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడం. అన్ని శక్తి కేంద్రాల్లో మీటింగులను సక్సెస్ చేసి తీరుతాం. సభలను అడ్డుకుంటూ దాడులకు పాల్పడే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తక్షణమే బాధ్యులను గుర్తించి అరెస్టు చేయాలి.

- కాసం వెంకటేశ్వర్లు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కమిటీ ఇన్‌చార్జ్

Tags:    

Similar News