నేషనల్ హైవేల పూర్తికి కోఆర్డినేషన్ ప్లాట్ ఫామ్!

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడ్డంకులను తొలగించేందుకు, వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు కోఆర్డినేషన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.

Update: 2024-08-08 02:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడ్డంకులను తొలగించేందుకు, వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు కోఆర్డినేషన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలిసింది. ముఖ్యంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రస్తుత పరిస్థితి, హైవే నంబర్‌ కేటాయింపు, నిర్మాణ ఖర్చు, భూసేకరణ, పరిహారం అంశాలపై చర్చ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. సమన్వయ వేదిక ద్వారా అడ్డంకులు తొలగించాలని భావిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు సుమారు 90 శాతం పూర్తయిన నేపథ్యంలో.. రహదారి నిర్మాణానికి టెండర్లకు వెళుతున్న నేపథ్యంలో ఈ సమన్వయం కీలక కానున్నది. మరోవైపు దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, దాని నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌, నిర్మాణ వ్యయం, ఈ భాగానికి నేషనల్‌ హైవే నంబర్‌ కేటాయింపు సహా మరికొన్ని అంశాలను కేంద్రం ముందు ఉంచింది. ఇటీవల కేంద్ర పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కలిశారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి త‌మ పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని, ర‌హ‌దారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొల‌గిస్తామ‌ని స్పష్టం చేశారు.

కసరత్తు చేస్తున్న ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్

కోఆర్డినేషన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించినట్లు తెలిసింది. భూసేకరణ అంశంలో రెవెన్యూ, అటవీ శాఖ, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ విభాగాల నుంచి ఇబ్బందులు రాకుండా ఇందులో చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా రహదారుల నిర్మాణానికి ఇసుక, కంకర, ఇతర ముడి పదార్థాల కోసం కూడా మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టే చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేక అధికారుల బృందం త్వరలో రానున్నట్లు తెలిసింది. దీంతో ఆ బృందం రాష్ట్రానికి చేరుకునేలోపే అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం ఒక కామన్ వేదికను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ను అధికారులు సిద్ధం చేయగా.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.


Similar News