‘వీఆర్ఏల సర్దుబాటు’లో వివాదం!
వీఆర్ఏల సర్దుబాటు వివాదంగా మారింది. సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతున్నదని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : వీఆర్ఏల సర్దుబాటు వివాదంగా మారింది. సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతున్నదని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ, చీఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లతోపాటు పలు జిల్లాల కలెక్టర్లను పార్టీగా చేర్చారు. తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, సబార్డినేట్లుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండానే పోస్టులను రూపొందించారని, సృష్టించిన పోస్టుల అవసరం ఏ మేరకు ఉన్నదన్న అంశంపై ఎలాంటి ఎక్సర్ సైజ్ జరగలేదని పేర్కొన్నారు. దీంతో తమకు పదోన్నతులు నిలిచిపోనున్నాయని ఆఫీస్ సబార్డినేట్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన వారిలో సిరిసిల్ల జిల్లా నుంచి కూడా పలువురు సబార్డినేట్లు ఉండడం గమనార్హం.
ఒక జోన్ లో ఉన్నవారికి మరో జోన్ లో పోస్టింగ్..
రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏల్లో 16,758 మందిని వారి విద్యార్హతలను బట్టి పోస్టులను కేటాయించారు. వీటివల్ల తమకు అన్యాయం జరుగుతుందని రెవెన్యూ ఆఫీస్ సబార్డినేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక జోన్ నుంచి మరో జోన్ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు అందింది. ఏయే జిల్లాల్లో ఎంత మంది ఉన్నారు? ఏం చదువుకున్నారు? ఏ జోన్ పరిధిలో ఉన్నారు? ఇలాంటివన్నీ సేకరించారు. అయితే ఒక జోన్ లో ఉన్నవారికి మరో జోన్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఉదాహరణకు వరంగల్ జిల్లాకు చెందిన వీఆర్ఏకు రంగారెడ్డి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ గా ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమె వరంగల్ జిల్లాలోనే పని చేస్తున్నారు. ఇప్పుడు అతను రంగారెడ్డి జిల్లాకి రావడం ద్వారా కొత్త సమస్యకు పురుడుపోశారు. అలాగే అదే జిల్లాకు చెందిన మరో వీఆర్ఏకు కూడా రంగారెడ్డి జిల్లాలోనే పోస్టింగ్ లభించింది. ఆమె భర్త వరంగల్ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి. ఆమెకు కూడా అదే సమస్య తలెత్తనున్నది. మళ్లీ వీళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా సొంత జిల్లాకు లేదా పక్కనున్న జిల్లాకు పోస్టింగ్ కావాలంటూ పైరవీ చేయకతప్పని పరిస్థితి నెలకొన్నది. తాజాగా వీఆర్ఏలకు ఇచ్చిన ఆర్డర్లలో పొరపాట్లు తలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజులుగా కసరత్తు చేసినా మళ్లీ పోస్టింగుల్లో అవకతవకలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉద్దేశ్యపూర్వకంగానే వివాదాలను సృష్టిస్తున్నారన్న అనుమానాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.