కేటీఆర్ తాట తీస్తాం.. బామ్మర్ధి కథతో బద్మాష్​ నాటకాలు : బండి

‘బామ్మర్ధి కథతో బద్మాష్​నాటకాలు ఆడటం బంద్ చేయ్ కేటీఆర్’ అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్ ఫైర్ అయ్యారు.

Update: 2024-09-22 13:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ‘బామ్మర్ధి కథతో బద్మాష్​నాటకాలు ఆడటం బంద్ చేయ్ కేటీఆర్’ అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అరాచకాలే అని మండిపడ్డారు. ప్రజలను వదిలేసి, బంధువులకు దోచి పెట్టడమే లక్ష్యంగా పనిచేశారని విమర్శించారు. వాళ్ల విధానాలే తాము అనుసరిస్తున్నామనే భ్రమలో కేటీఆర్ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుండన్నారు. కేంద్ర పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు భవిష్యత్తులేదని తేలిపోవడంతో, కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రజలకు దూరమైన ప్రభుత్వమైతే, కాంగ్రెస్ ప్రజలకు దగ్గరైన ప్రభుత్వం అనేది కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నదన్నారు.

గతంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరినందుకు నజరానాగా పాలమూరు రంగారెడ్డి వర్క్‌లు ఇస్తే, ఆయన అల్లుడు సృజన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే సృజన్ రెడ్డికి, కేటీఆర్‌కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. కేటీఆర్‌కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి ఒకరనే సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని చురకలు అంటించారు. అమృత్ టెండర్లలో సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్ వచ్చిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, అయితే టెండర్లు పిలిచినప్పుడు ఆర్థికంగా సాంకేతికంగా అనుభవం ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్ల పాల్గొంటాయనే విషయం మాజీ మంత్రికి తెలియాదా? అంటూ నిలదీశారు. స్టార్ టాప్ కంపెనీలు ఆర్థికంగా ఉండి, సాంకేతిక అనుభవం లేకపోతే, జాయింట్ వెంచర్ పెట్టుకొని టెండర్లలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

త్వరలోనే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములను కన్వర్షన్ చేశారు? ఎన్ని బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చారు? అనే అంశాలపై ఎంక్వైరీ చేస్తామన్నారు. ఈ అనుమతుల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వెయ్యి కోట్ల రూపాయల యాదాద్రి పునర్నిర్మాణ పనులను ఏ అనుభవం లేని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో జరిపించింది మీరే కదా? అంటూ ప్రశ్నించారు. మల్టీ నేషనల్ కంపెనీ ఆర్కిటెక్ట్ నిపుణులతో యాదాద్రి పనులు చేయాల్సి ఉండగా, చిన జీయర్ స్వామి కళ్లల్లో ఆనందం కోసమే ఆనందసాయికి అప్పజెప్పారు కదా..? అందులో మీరెంత తిన్నారు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Similar News