దిశ, తెలంగాణ బ్యూరో: హిందూ విద్వేషంతో కలుషితమైపోయిన కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని మంగళవారం రోజు హనుమాన్ మందిరాల్లో, ప్రధాన చౌరస్తాలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని చాలీసా పారాయణం చేయాలని వారు పిలుపునిచ్చారు. హనుమాన్ మందిరాలు, ప్రధాన చౌరస్తాల్లో నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమానికి కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా హిందువులందరూ తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గమన్నారు.
ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు. అత్యంత భయంకరమైన తీవ్రవాద సంస్థ పీఎఫ్ఐతో బజరంగ్ దళ్‌ను పోలుస్తూ.. ముస్లింలను, ఉగ్రవాదులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలకు సద్బుద్ధి కలగాలని.. హిందూ దేవుళ్ళపై విమర్శలు మానుకోవాలని.. భారతీయ సంప్రదాయాలను గౌరవించేలా బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హనుమాన్ మందిరాల్లో, ప్రధాన చౌరస్తాలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పిలుపునిచ్చారు.