చామల ఓటమిని కోమటిరెడ్డి బ్రదర్స్ పై వేసేందుకే సీఎం రేవంత్ ప్రలోభాలు: బూర నర్సయ్య గౌడ్
మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హోంమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ్రమలో పెట్టారని, నిన్న వెంకటరెడ్డిని సీఎంగా చేశారని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హోంమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ్రమలో పెట్టారని, నిన్న వెంకటరెడ్డిని సీఎంగా చేశారని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరికీ తెలియని వ్యక్తికి సీఎం రేవంత్ భువనగిరి సీటు కేటాయించారని ఆయన విమర్శలు చేశారు. ఒక్క డమ్మీకి టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక అని తొలుత భావించారని, కానీ తన ఎంట్రీతో ఆ సీన్ రివర్స్ అయిందని బూర పేర్కొన్నారు. రేవంత్ ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని ఆయన చురకలంటించారు.
బూరను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి కలిసి క్యామ మల్లేష్ కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారన్నారు. రైతుబంధు కూడా ఇవ్వని స్థితిలో ఉన్న రేవంత్.. మూసీ ప్రక్షాళన చేస్తాడా అంటూ మండిపడ్డారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రజలను ఫూల్స్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. చామల ఓటమిని కోమటిరెడ్డి బ్రదర్స్ పై వేసేందుకు వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. భువనగిరిలో గెలుపు కోసం రేవంత్ నానా తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జైశంకర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. భువనగిరిలో కాషాయ జెండా ఎగురవేసి అహంకార, ఆధిపత్యపూరిత కుటుంబాలను తరిమికొడతామన్నారు.