టార్గెట్ బీజేపీ.. కాంగ్రెస్ ఆయుధంగా కాస్ట్ సెన్సెస్
రాష్ట్రంలో కులగణన సర్వేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 6 నుంచి సర్వే మొదలు కాబోతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కులగణన సర్వేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 6 నుంచి సర్వే మొదలు కాబోతున్నది. అయితే.. రాష్ట్రంలో కులగణన కోసం జరుగుతున్న ప్రాసెస్, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు జరిగే మేలు వంటి అంశాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా వేగంగా ఇంప్లిమెంట్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన సజావుగా జరిగేందుకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన కులగణనను పరిగణలోకి తీసుకోవాలని రాహుల్ కేంద్రంపై ప్రెజర్ పెంచనున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకుంటే, పార్లమెంట్‌లో బీజేపీని నిలదీయాలని ఏఐసీసీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా కాంగ్రెస్ కోరనున్నది. దీని వలన అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కాంగ్రెస్‌కు మరింత మైలేజ్ పెరుగుతుందని, తద్వారా కేంద్రంలో పవర్‌లోకి రావచ్చు అనే ఫీలింగ్‌లో ఏఐసీసీ ఉన్నది. ఇదే అంశంపై ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతోనూ చర్చించినట్లు తెలిసింది. తెలంగాణలో తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాన్ని దేశవ్యాప్తికి కారణం అవుతున్నదని, సెంట్రల్‌లో పవర్ సాధించేందుకు ఇది మంచి అస్త్రంగా వినియోగించుకోవచ్చని అగ్రనేతలు భావిస్తున్నారు.
500 మందితో ఇంటరాక్ట్..
కులగణనపై సీరియస్‌గా ఉన్నామనే సంకేతం ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. క్యాస్ట్ సెన్సెస్‌పై స్వయంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో డిస్కషన్ చేయనున్నారు. ఈ నెల 5న బోయిన్‌పల్లిలోని ఐడియాలజీ సెంటర్‌లో ఈ సెమినార్ నిర్వహించనున్నారు. విద్యావేత్తలు, ఫ్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ కుల సంఘాలు, మేధావులు, కవులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు.. ఇలా వివిధ కేటగిరీల నుంచి సుమారు 500 మందితో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సెమినార్‌లో కులగణనపై స్పష్టమైన ఫీడ్ బ్యాక్‌ను గణాంకాలతో సహా సేకరించనున్నారు. కులగణనతో కలిగే లాభాలు, ప్రస్తుతం ఉన్న సమస్యలు.. ఇలా అన్నింటినీ నివేదిక రూపంలో తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు అవసరమైన కసరత్తుపైనా చర్చించనున్నారు. దాదాపు గంటసేపు ఈ సెమినార్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
బీసీ కమిషన్ నివేదిక సైతం..?
గత నెల 28 నుంచి ఈ నెల 8 వరకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణనపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉమ్మడి జిల్లాల వారీగా కలెక్టరేట్లలో సమీక్షలు నిర్వహించి బీసీ కమిషన్ నివేదికలు తయారు చేస్తున్నది. ఇది పూర్తయిన తర్వాత ఆ రిపోర్టును కూడా రాహుల్ పరిశీలించనున్నారు. కేంద్రంపై సమర్థవంతంగా ప్రెజర్ పెట్టేందుకు తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ కోసం అవలంబిస్తున్న విధానాలన్నింటినీ డిటైల్డ్‌గా స్టడీ చేయనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాసంఘాలు, కీలక ఫ్రొఫెసర్లతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా కులగణను సమర్థవంతంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే మేధావులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. కులగణనపై చర్చించారు. ప్రజల నుంచి ఎలా వివరాలు సేకరించాలనే దానిపై ఓ ఫార్మాట్‌ను తయారు చేశారు. ఈ నెల 6న ప్రతి ఇంటి నుంచి వివరాలను సేకరించనున్నారు. డీసీసీల ఆధ్వర్యంలో 33 జిల్లాల్లోనూ పార్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. ఓ విడత ముఖ్య నేతల సమావేశాలను కూడా నిర్వహించారు. కులగణన కోసం సీఎం కూడా ఆదివారం డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో కులగణనపై రాష్ట్రం ఏ స్థాయిలో సీరియస్‌గా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.