గులాబీ అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం.. కేసీఆర్‌కు షాక్​ఇచ్చేలా ప్లాన్

ఇన్నాళ్లు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేందుకే పరిమితమైన టీ కాంగ్రెస్.. ఇకనుంచి చేరికలపైన దృష్టి పెట్టనుంది.

Update: 2023-04-22 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇన్నాళ్లు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేందుకే పరిమితమైన టీ కాంగ్రెస్.. ఇకనుంచి చేరికలపైన దృష్టి పెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్​ అసంతృప్తులకు గాలం వేయాలని ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్​బలోపేతానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సుమారు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులు ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది. మిగతా స్థానాల్లోనూ ఫోకస్​పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా 11 జిల్లాలపై ఫోకస్ చేసింది. ఆయా జిల్లాల్లోని బీఆర్ఎస్​పై అసంతృప్తితో ఉన్న ముఖ్య నేతలకు కండువా కప్పేలా వ్యూహ రచనలు చేస్తున్నది.

సదరు లీడర్లకు భరోసా ఇచ్చేందుకు నేరుగా రాహుల్​గాంధీని ఈ టాస్క్​లో ఇన్వాల్వ్​చేయనున్నది. దీంతో నేతల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పార్టీకి మేలు జరుగుతుందని టీపీసీసీ ఆలోచిస్తున్నది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపడంతో పాటు .. కనీసం 70 సీట్లు తగ్గకుండా గెలవాలని పార్టీ సీరియస్​గా తీసుకున్నది. ప్రజలతో మరింత మమేకమైతే మరో ఐదు నుంచి 10 సీట్లను గెలవచ్చని ఇటీవల కాంగ్రెస్​చేయించుకున్న ఇంటర్నల్​సర్వేలో తేలినట్లు సమాచారం.

పొంగులేటితో షురూ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేత అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో టాస్క్​ను షురూ చేయాలని టీ కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే పొంగులేటి, పార్టీ ముఖ్యుల మధ్య చర్చలు జరిగినా.. తుది నిర్ణయంపై ఓ కొలిక్కి రాలేదు. కానీ ఆయన చేరిక అనంతరం ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్​నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలను చేర్చుకోవాలని సంప్రదింపులు చేస్తున్నది. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్సీలతోనూ కాంగ్రెస్​టచ్​లోకి వెళుతున్నది. టిక్కెట్లు ఆఫర్లతో గాలం వేయనున్నది.

పార్టీని వదిలి వెళ్లినోళ్లను..

ఇప్పటికే కాంగ్రెస్​కు హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీ లోకి వెళ్లి లబ్ధి పొంది, ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న నేతలను మాత్రం మళ్లీ చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పార్టీ కేడర్​లో విభేదాలు ఏర్పడి, చీలికలు వచ్చే ప్రమాదముందని టీ పీసీసీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రజల్లో మంచి పేరు, బలాన్ని సాధించిన నేతలపైనే ప్రధానంగా ఫోకస్​పెట్టనున్నారు. బీఆర్ఎస్​లో టిక్కెట్లు రావని భావించేటోళ్లను కూడా ముందస్తుగా సంప్రదింపులు చేసి హోల్డ్​లో పెట్టేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. అన్ని జిల్లాల్లో చేరికల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే కాంగ్రెస్ చేరికల టాస్క్​ఏ విధంగా సక్సెస్​ అవుతుందనేది ? కొద్దిరోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News