బిగ్ న్యూస్: T-కాంగ్రెస్‌లో తెరపైకి మరో కొత్త పంచాయతీ.. ఇకపై హస్తం పార్టీలో అన్ని వేరు వేరేనా..?
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప సమసిపోవడం లేదు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప సమసిపోవడం లేదు. ఇటీవల పాదయాత్ర పేరుతో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తాజాగా మరో పంచాయతీని ముందటేసుకున్నారు. పాదయాత్రలన్ని పార్టీ యాత్రలే అని పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం నేతల మధ్య గ్యాప్ ఏ రేంజ్‌లో ఉందనడానికి తాజా పరిణామాలే అద్దం పడుతున్నాయనే చర్చ జరుగుతోంది.
పార్టీ పెద్దలు ఆదేశించినప్పటికీ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రారంభించిన నినాదం బాగోలేదని సరికొత్త నినాదంతో ముందుకు వచ్చాడు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. అంతే కాదు తాను సూచిస్తున్న నినాదం పార్టీ అధికారిక నినాదంగా ఉండేలా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెబుతున్నాడు. దీంతో టీకాంగ్రెస్‌లో ఓ వివాదం ముగియగానే మరో వివాదం వెన్నంటుతూనే ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల హాత్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ‘బైబై కేసీఆర్’ అనే నినాదం ఉపయోగించారు. ఇకపై కాంగ్రెస్ నినాదం ఇదే అని అనౌన్స్ చేశారు. ఈ నినాదాన్నే రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశాయి. అయితే ఈ నినాదం బాగోలేదని బక్క జడ్సన్ ఆరోపించారు. బైబై కేసీఆర్ అని కాంగ్రెస్ శ్రేణులు అంటే బైబై కాంగ్రెస్ అని ప్రత్యర్థులు నినాదం చేస్తారని.. పైగా ఇది అందరినీ ఆకట్టుకునేలా లేదని అన్నారు. అందుకోసమే తాను 'చాలు కారు ఓ కేసీఆర్' పేరుతో కొత్త నినాదం తీసుకువస్తున్నాన్నారు.
ఇది సామాన్య ప్రజలకు సైతం అర్థం అవుతుందని చెప్పారు. తాను సూచించిన నినాదంలో ఎవరికి కేసీఆర్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారు, సీఎం కేసీఆర్ పేర్లు ఉన్నాయని అందువల్ల గ్రామీణ ప్రాంత ఓటర్లకు సైతం తన నినాదం సులభంగా అర్థం అవుతుందని చెప్పారు. దీన్నే అఫిషీయల్ స్లోగన్‌గా చేయాలని పార్టీ పెద్దలను కోరబోతున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టీ కాంగ్రెస్ పార్టీకి తాజాగా స్లోగన్ ఇష్యు పరిణామం ఎటువైపు తీసుకువెళ్తుందో అనేది వేచి చూడాలి.