ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: MLC
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను రక్షించేందుకు బీజేపీ సీబీఐ విచారణను కోరుతుందన్నారు. ఇది అత్యంత దారుణమన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టి వేధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నదని, కానీ కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నదని జీవన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. కాళేశ్వరంపై జ్యూడిషీయల్ ఎంక్వైరీ కొనసాగుతున్నదని, పూర్తిస్థాయి రిపోర్టు వచ్చిన వెంటనే చర్యలు తప్పవన్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోల కేసులో బీఎల్ సంతోష్‌ను ఇరికించారని బీజేపీ పదే పదే చెప్తుందని, కానీ ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలసి ఆడుతున్న డ్రామాలు ఇప్పటికైనా బంద్ చేయాలని కోరారు.