కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ: ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వ్యవహారం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వర్గీయుల మధ్య వివాదం రేపిన విషయం తెలిసిందే.

Update: 2024-10-14 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వ్యవహారం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వర్గీయుల మధ్య వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఓపెద్ద కుటుంబం అని, ఇంత కుటుంబంలో చిన్నచిన్న గొడవలు సాధారణమని అన్నారు. తామంతా అధిష్ఠానం డైరెక్షన్‌లోనే నడుస్తామని, ఎవరికీ ఎవరిపై వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములుగా తమకు ప్రజలే ముఖ్యమని, వారి అభ్యున్నతి కోసమే పాటుపడతామని తేల్చి చెప్పారు.

అసలు గొడవ ఏంటి..?

దసరా పండుగను పురస్కరించుకుని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారంలో మంత్రి కొండా అభిమానులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో కాంగ్రెస్‌కే చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం ఆగ్రహంతో ఫ్లెక్సీలు చించేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే వివాదంలో రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది.

కాగా.. కొండా వర్గం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ హుటాహుటిన ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆమెకు నచ్చజెప్పి పంపించడంతో వ్యవహారం శాంతించింది. ఇదే ఘటనలో రేవూరి వర్గానికి చెందిన పిట్టల అనిల్‌పై దాడి చేశారనే ఆరోపణలతో కొండా వర్గానికి చెందిన 8 మందిపై గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు.


Similar News