Congress: 2 లక్షల పైన రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ అప్పుడే.. మంత్రి తుమ్మల

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతేనని, ఇచ్చిన మాట ప్రకారం 42 లక్షల కుటుంబాలను రుణవిముక్తులను చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని, కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు.

Update: 2024-10-19 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతేనని, ఇచ్చిన మాట ప్రకారం 42 లక్షల కుటుంబాలను రుణవిముక్తులను చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని, కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్కే భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రుణమాఫీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాతవరణ మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తున్నామని అన్నారు. ఆర్థిక పరంగా వెసులుబాటు లేకపోయినా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు సీఎ రేవంత్ రెడ్డి పట్టుదలతో రుణమాఫీ భారాన్ని మీద వేసుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్సార్ హయాంలో దేశవ్యాప్తంగా 70 వేల కోట్ల రుణమాఫీ చేశారని తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి సగం మందికే చేశారని, ఆ రైతులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలలో రైతులు తీసుకున్న మొత్తం రుణమాఫీ చేశామని తెలిపారు. బ్యాంకులు పంపిన వివరాల ప్రకారం 42 లక్షల ఖాతాలు, 24 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని అంచనా వేసి, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15న 2 లక్షల రుణం ఉన్న రైతుల ఖాతాలకు దాదాపు 18 వేల కోట్లు జమ చేశామని వివరించారు.

గత ప్రభుత్వం పంటభీమా పథకాన్ని ఎత్తేసింది

ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశామో నియోజకవర్గాల వారిగా రైతుల వివరాలు, రుణమాఫీ వివరాలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పంపిస్తున్నామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదని, ఈ డిసెంబర్ లోపు సుమారు 2500 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇక 2 లక్షల పైచిలుకు రుణం ఉన్నవారికి కూడా రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారని, ఆ రైతులకు ఒక షెడ్యూల్ ప్రకటించి 2 లక్షల పైచిలుకు అమౌంట్ వారు కట్టుకుంటే మిగిలిన 2 లక్షలు ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 42 లక్షల కుటుంబాలను రుణవిముక్తులను చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఇక పంటల భీమా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గత ఐదేళ్లలో భీమా పథకాన్ని ఎత్తేశారని, అలాగే ఫసల్ భీమాను కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా పంట నష్టపోయినా సరే వారికి 10 వేల రూపాయలు ఇస్తున్నామని, కానీ అది రైతుకు ఎటువంటి వెసులుబాటు అవ్వట్లేదని అన్నారు. అందుకే రైతులకు మేలు జరిగే విధంగా పంటభీమా కల్పించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీలను టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు.

కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా..


రైతులకు ఎంత భూమి ఉన్నా రాష్ట్రంలోని ప్రతీ పంట భూమికి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట నష్టపోయిన రైతులకు మేలైన పరిహారం అందివ్వాలనేది రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో పండిన అన్ని పంటలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్ఎస్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోయినా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి ప్రతీ పంట కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇక ఈ పంటలకు కేంద్రం అదే ధరలకు బాధ్యతగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా 25 వేల కోట్లు రైతు బంధు ఇచ్చిందని ఫిర్యాదులు వచ్చాయని, భవిష్యత్తులో అలాంటి ఫిర్యాదులు లేకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు తయారు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతేనని, అందుకే కష్టకాలంలో కూడా 50 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని తెలిపారు. రుణమాఫీ గురించి ఆలోచన చేయని ప్రభుత్వాలు, అరకొర చేసిన పార్టీలు తప్పుగా మాట్లాడితే రైతులు వారిని క్షమించరని వ్యాఖ్యానించారు.  


Similar News