డబుల్ డిజిటా.. ఆ లోపేనా...? లోక్‌సభ విజయంపై కాంగ్రెస్ నేతల లెక్కలు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తృతంగా జరుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తృతంగా జరుగుతున్నది. పోలింగ్ తర్వాత విజయంపై నేతలంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్ని సీట్లలో పక్కా గెలుస్తాం? అవి ఏయే సెగ్మెంట్లు అని పోలింగ్ శాతాన్ని బట్టి అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి లీడర్ల నుంచి మంత్రుల వరకు ఎవరికి వారు తమదైన శైలీలో అనాలసిస్ చేస్తున్నారు. పార్టీలోని వివిధ కీలక నేతలు అంచనాల ప్రకారం 9 నుంచి 10 స్థానాల్లో పక్కా గెలుస్తామని నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వేవ్ కలిసి వస్తే మరో రెండు సెగ్మెంట్లలోనూ స్వల్ప మెజార్టీతో బయట పడే అవకాశం ఉన్నదని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. దక్షిణ తెలంగాణలోని పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ క్లీన్ స్వీప్ అవుతాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
అయితే గతంతో పోల్చితే పోలింగ్ శాతం పెరగడంతో ఆయా ఓట్లన్నీ తమకే పొలరైజ్ అవుతాయని పార్టీ బలంగా నమ్ముతున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ ఇన్‌చార్జీలు, కో-ఇన్‌చార్జీలు, కో-ఆర్డినేషన్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి పార్లమెంట్ ఇన్‌చార్జీ మంత్రులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లు తిరుగుతూ ఓటర్ల ట్రెండ్‌ను అబ్జర్వ్ చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలను మోటివేట్ చేస్తూ బూత్‌లకు తరలించడం గమనార్హం.
గతంతో పోల్చితే డిఫరెంట్
2019తో పోల్చితే ఈసారి బీజేపీ హవా మరింత పెరిగిందనేది రాజకీయ లీడర్ల అంచనా. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని పొలిటికల్ అనాలసిస్టులు చెబుతున్నారు. దీంతోనే అర్బన్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ట్రెండ్ కనిపించిందని వివరించారు. రూరల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపించిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కానీ, మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుందని నొక్కి చెప్పారు. మరోవైపు ఈసారి తటస్థ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్నదనీ వెల్లడించారు. అయితే, ఆ ఓటు బ్యాంక్ ఎవరి వైపు ఉంటే ఆయా పార్టీలకు లీడింగ్ స్థానాలు రానున్నాయని పేర్కొన్నారు. మెజార్టీలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పారు.
ఉత్కంఠగా పోలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రాసెస్ ఉత్కంఠగా ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీడ్‌గా జరిగిన పోలింగ్, ఆ తర్వాత రెండు, మూడు గంటల పాటు మందకోడిగా కొనసాగింది. మూడు తర్వాత మళ్లీ ఊపందుకున్నదని పోలింగ్ కేంద్రాల అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులతోనే ఇలాంటి సిచ్వేషన్ వచ్చిందని తెలిపారు. సోమవారం సాయంత్రం 5.30 లెక్కల ప్రకారం అదిలాబాద్ లోక్ సభ పరిధిలో 69.81 ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపించినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లిలో 63.86 శాతం రికార్డు కాగా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో 67.67 ఓటింగ్ శాతం నమోదు కాగా, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌ల మధ్య ఫైట్ ఉన్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్‌లో 67.96 శాతం ఓటింగ్ నమోదు కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నట్లు గుర్తించామని వివిధ పార్టీల లీడర్లు చెప్తున్నారు. జహీరాబాద్‌లో 71.91 శాతం ఓటింగ్‌తో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య టఫ్‌ఫైట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మెదక్‌లో 71.33 శాతం ఓటింగ్ తేలగా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. మల్కాజిగిరిలో 46.27 నమోదు కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. సికింద్రాబాద్‌లో 42.48 శాతం ఓటింగ్ నమోదు కాగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
హైదరాబాద్‌లో 39.17 ఉండగా, ఎంఐఎం, బీజేపీల మధ్య స్వల్ప పోటీ ఉన్నట్లు వివరిస్తున్నారు. చేవెళ్లలో 53.15 శాతం ఓటింగ్ నమోదు కాగా, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్నట్లు రాజకీయ పార్టీల లీడర్లు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్‌లో 68.40 రికార్డు కాగా, బీజేపీ, కాంగ్రెస్, నాగర్ కర్నూల్‌లో 66.53 ఓటింగ్ నమోదు కాగా, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అత్యధికంగా పోటీ ఉన్నట్లు వివరిస్తున్నారు. ఇక నల్లగొండ, భువనగిరిలో సగటు 70 శాతం చొప్పున రికార్డు కాగా, ఈ రెండింటిలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే స్వల్ప పోటీ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పున్నారు. వరంగల్ లో 64.08 శాతం ఓటింగ్ తేలగా, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నదని చెప్పారు. ఇక మహబూబాబాద్‌లో 68.60, ఖమ్మంలో 70.76 శాతం ఓటింగ్ నిర్ధారణ కాగా, రెండింటిలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉన్నదని వివరిస్తున్నారు. దీంతో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారో? అని కాంగ్రెస్ క్యాండిడేట్స్ టెన్షన్ పడుతున్నారు.