అలా అయితే రేవంత్ రెడ్డిపై పార్టీ చర్యలు తీసుకుంటుంది!: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అయితే పార్టీ చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అయితే పార్టీ చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కానీ విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పినదాన్ని వక్రీకరించారని అన్నారు. రాష్ట్రంలో రెండు మూడు ఎకరాలు ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు చాలామంది ఉన్నారని.. వాళ్లకు ఎకరానికి రెండు మూడు గంటల చొప్పున 8 గంటల కరెంట్ ఇచ్చినా సరిపోతుందని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పారని తెలిపారు. అంతేగానీ 8 గంటల విద్యుత్ సరిపోతుందని, 24 గంటల కరెంట్ తాము ఇవ్వబోమని రేవంత్ ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఒకవేళ ఆయన అలా అంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కానీ రేవంత్ అలా అనలేదన్న పొన్నం.. బీఆర్ఎస్ నాయకులు రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు. అసలు ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటే రైతులు.. రైతులు అంటే కాంగ్రెస్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ మంత్రులను కోరారు.
బీఆర్ఎస్ నేతలు రోడ్డు మీదకు వచ్చి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయునుందని రాద్దాంతం చేస్తున్నారని, దమ్ముంటే రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని కేసీఆర్ ను అడగాలని బీఆర్ఎస్ మంత్రులకు సవాలు విసిరారు. దేశానికి అన్నంపెట్టిన కాంగ్రెస్ పార్టీనా మీరు విమర్శించేది అని ఆయన మండిపడ్డారు. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అన్న ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రజలు ఆదరించబోతున్నారని తెలిపారు. ఎన్నికల్లో తాము ఏం వాగ్దానం ఇస్తామో వాటిని నెరవేరుస్తామని చెప్పారు. గతంలో కూడా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా వరికి మద్దతు ధర రూ.2500, రుణమాఫీ రూ.2 లక్షలు, పనిముట్లు మొదలైనవాటితో పాటు యూత్ డిక్లరేషన్ లో పేర్కొన్న అనేక విషయాలు తాము నెరవేరుస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో విషయాలు ఆయన ‘దిశ టీవీ’తో పంచుకున్నారు. ఆ విషయాలన్నీ తెలియాలంటే కింది వీడియోను చూడండి.